సమతామూర్తి స్పూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం మరికొన్ని రోజుల్లో జరగనుండగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి, మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డా.జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ వైస్ చైర్మన్ రామురావు ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో పాటు ఈ వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఈ ఏడాది చివరలో నిర్వహించే ముగింపు వేడుకలకు హాజరు కావాలని వీళ్ళు మోదీని కోరగా మోదీ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

 హైదరాబాద్ ముచ్చింతల్‌లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం విశేషాలను డాక్టర్ రామేశ్వరరావ్, రామురావు, చినజీయర్ స్వామీ ప్రధాని మోదీకి  వివరించినట్టు సమాచారం.  సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో ఉన్న 108 దివ్య దేశాలలో కొలువుతీరిన దేవతామూర్తులకు జరిగే నిత్య కైంకర్యాలకు సంబంధించిన పూర్తి  వివరాలను  సైతం ప్రధాని మోదీకి తెలియజేసినట్టు భోగట్టా.

 జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేత్ర విద్యాలయం, ఆయుర్వేద- హోమియో కళాశాల పురోగతి గురించి సైతం ప్రధాని నరేంద్ర మోదీ  తెలుసుకున్నారని 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగిందని సమాచారం అందుతోంది.   మైహోమ్‌ గ్రూప్ చైర్మన్ డా. రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావును  ఆధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ మోదీ  అభినందించారని తెలుస్తోంది.

ప్రధాని మోదీ  కచ్చితంగా ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వేడుకలకు చాలా సమయం ఉన్నప్పటికీ మోదీ  కచ్చితంగా హాజరు కావాలనే ఆలోచనతో ఆయనను ముందుగానే ఇన్వైట్ చేశారని తెలుస్తోంది. మోదీని  చినజీయర్ స్వామి కలిసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ప్రధానమంత్రి  నరేంద్ర మోదీకి ఆధ్యాత్మిక భావన ఎక్కువనే సంగతి తెలిసిందే. ఈ తరహా కార్యక్రమాలకు హాజరు కావడానికి మోదీ  సైతం ఒకింత ఎక్కువగానే ఆసక్తి చూపిస్తారని తెలుస్తోంది.  ఈ కార్యక్రమానికి సంబంధించిన  పూర్తి  వివరాలు మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: