
ఈ మద్య వివాహ బంధంతో ఒక్కటైన జంట చిన్న చిన్న కారణాల వల్ల విడిపోతున్నారు. ఆ తర్వాత వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. కొంత కాలం తర్వాత అది బెడిసి కొట్టి హత్యలకు దారి తీయడం జరుగుతుంది. మరికొంత మంది భార్యాభర్తలు వివాహేతర సంబంధాల వల్ల ఒకరినొకరు చంపుకోవడం జరుగుతుంది. ఇలా వివాహ వ్యవస్థకు మచ్చతెచ్చే దారుణ ఘటనలు ఈ మద్య ఎన్నో వెలుగు చూసాయి. తాజాగా తన ఆస్థిలో వాటా అడిగినందుకు ప్రియురాలిని దారుణంగా చంపాడు ప్రియుడు. వివరాల్లోకి వెళితే.. పదిహేనేళ్ల క్రితం ఓ వివాహిత భర్తతో విభేదించి తన పుట్టింటికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమెకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే పదిహేను సంవత్సరాలు ఆ వ్యక్తితో గడిపినందుకు తనకు కూడా ఆస్తిలో వాటా కావాలని డిమాండ్ చేసింది. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఆ వ్యక్తి ఆస్తి కోసం డిమాండ్ చేస్తావా? అంటూ ఆమెను అంతమొందించాడు.
ఈ ఘటన కర్ణాటకలోని హగరిబొమ్మనహళ్లి ప్రాంతంలో వెలుగు చూసింది. గిరిగూండనహళ్లి గ్రామానికి చెందిన డీ హులిగమ్మ(42)కు హోసపేటకు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. కొద్ది కాలానికే భర్తతో విభేదాలు రావడం.. పుట్టింటికి చేరుకోవడం జరిగింది. ఒంటరిగా ఉన్న ఆమెకు సొంతూరులోనే సిద్ధలింగప్ప అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది. పదిహేను సంవత్సరాల నుంచి హులిగమ్మతో లింగప్ప వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే సిద్ధలింగప్ప భారీగా ఆస్తులు ఉన్న విషయం తెలుసుకొని హులిగమ్మ తనకు కూడా వాటా కావాలని డిమాండ్ చేసింది.
నీ కుటుంబాన్ని ఆదుకుంటూ.. కోరికలు తీరుస్తున్నా.. మళ్లీ ఆస్తిలో కూడా వాటా కావాలా? అని ఆమెను అడిగాడు. ఆస్తి కోసం ఆమె మొండి పట్టుపట్టడంతో.. ఈ నెల 13వ తేదీన తన పొలం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ హులిగమ్మను చంపేసి.. పొలంలోనే పాతిపెట్టాడు. హులిగమ్మ రెండు రోజులు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు సిద్ధలింగప్పపై కేసు పెట్టారు. అతన్ని పోలీసులు విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.