క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ శుక్రవారం హైదరాబాద్‌లో సందడి చేశాడు. నగరంలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన హైదరాబాద్ బిర్యానీకి మారుపేరుగా నిలిచిన ప్యారడైజ్ హోటల్‌ను సందర్శించాడు. హోటల్ యజమానులతో కాసేపు ముచ్చటించి ఇరానీ చాయ్ తాగాడు. సచిన్‌తో ఫొటో దిగేందుకు హోటల్ సిబ్బంది ఉత్సాహం చూపడంతో వారి కోరికను తీర్చాడు. గతంలో స్పిన్నర్ ఓజా... తనకిక్కడ బిర్యానీ రుచి చూపించాడని గుర్తుచేసుకున్నాడు. మరోవైపు తమ ఆరాధ్య క్రికెటర్ ప్యారడైజ్‌కు వచ్చాడనే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున హోటల్ ముందు గుమిగూడారు. సచిన్‌తో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. ఎయిర్‌పోర్ట్‌లో నిరీక్షణ- సచిన్ టెండూల్కర్ ముంబైకి వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో మూడు గంటల పాటు విమానాశ్రయంలోనే నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడి నుంచి టేకాఫ్ కావాల్సిన జెట్ కనెక్ట్ ఎయిర్‌లైన్స్ విమానం సాయంత్రం 6.10 గంటలకు బయలుదేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: