ఆర్థిక నేరాలు, వైట్ కాలర్ నేరాలపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆందోళనకు గురిచేసేవిగా ఉన్నాయి. పాలకుల ముసుగులో ఏ విధంగా ఆర్థిక నేరాలు జరుగుతున్నాయో ఇటీవల సంఘటనలు మన కళ్లెదుటే ఉన్నాయి. రాజకీయంగా రంగ ప్రవేశం చేసినవారు కోట్లకు పడగలెత్తుతున్నారు. వారి సంపాదన పై చెక్ లేకపోవడంతో 2జీ, బొగ్గు కుంభకోణాలాంటివి కోకొల్లుగా పుట్టుకొస్తున్నాయి. సంపాదనే ధ్యేయంగా జగన్ లాంటి వాళ్ళు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు.

దురదృష్టశాత్తు కొన్ని సంవత్సరాలుగా ప్రమాదకరస్థాయిలో పెరిగిపోతున్న ఆర్థికనేరాలు దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్ర ప్రభావానికి గురిచేశాయి. దేశ సమగ్రాభివృద్ధిపై ఆర్థిక నేరాలు విపరీత ప్రభావాన్ని చూపుతాయన్నది వాస్తవమని సుప్రీం కోర్టు నిమ్మగడ్డ బెయిల్ పిటీషన్ ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో పేర్కొన్నది.  ఆర్థిక నేరాలు హత్యలకంటే ప్రమాదకరమైనవని పునరుద్ఘాటించింది. దేశ ఆర్తిక వ్యవస్థను నాశనం చేసిన ఆర్థిక నేరగాళ్లను శిక్షించకపోతే మొత్తం సమాజం నష్టపోతుంది. హత్యలు ఆవేశ వేడిలో జరగొచ్చు. కానీ ఆర్థిక నేరాలు మాత్రం నింపాదైన లెక్కలు, ఉద్దేశపూర్వకమైన ప్రణాళిక, సమాజ ప్రయోజనాలను గాలికొదిలి వ్యక్తిగత లాభాలను దృష్టిలో ఉంచుకునే చేస్తారు.

సుప్రీం కోర్టు ఇటీవల వివిధ కేసుల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తాజాగా జగన్ తదితరుల బెయిల్ విషయంలో కూడా సీరియస్ గానే వ్యాఖ్యానించింది. బెయిలు కోసం జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన పిటీషన్లను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. విజయసాయి రెడ్డి బెయిలునూ రద్దు చేసింది. ముగ్గురి కేసుల్లో వేర్వేరు తీర్పులిచ్చినప్పటికీ ఆర్థిక నేరాలపై ధర్మాసనం ఒకే రకమైన అభిప్రాయం, ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేరాలు దేశ ఆర్థిక నాడీ వ్యవస్థను నాశనం చేస్తున్నాయని అభిప్రాయ పడింది. ఆర్థిక నేరగాళ్లను శిక్షించపోతే సమాజం నష్టపోతుందని హెచ్చరించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: