ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ తరపున జగన్ తల్లి విజయమ్మ రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా కందుకూరులో ఆమె ప్రచారం ప్రారంభించారు. ధర్మానికి, అధర్మానికి.. న్యాయానికి, అన్యాయానికి.., విలువలకు, వంచనకు మధ్య.. జరుగుతున్న ఎన్నికలుగా వీటిని అభివర్ణించారు విజయమ్మ. దివంగత నేత వై.ఎస్. ఆశయాలకోసమే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పుట్టిందని విజయమ్మ గుర్తు చేశారు. మీ భుజస్కంధాలపై వైయస్ రాజశేఖర్ రెడ్డిని మోశారని.. ఆయన ముఖ్యమంత్రి అయ్యి అందరికి సంక్షేమ పథకాలు అందించారని విజయమ్మ చెప్పారు.

తొమ్మిదేళ్లుగా జగన్ బాబు మీలోనే ఉన్నాడని.. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయామని చెప్పారు. ఈ సారి అలాంటి తప్పు చేయొద్దని కోరారు. వైయస్ మరణం తర్వాత ఈ తొమ్మిదేళ్లలో తాము నష్టపోయిన దానికన్నా  ఈ రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందని విజయమ్మ చెప్పారు. వైఎస్ మరణం తర్వాత జరిగిన పాలన చూస్తే బాధేస్తోందన్నారు.

వైయస్ తర్వాత జగన్ బాబు మీకోసం నిలబడ్డారని విజయమ్మ గుర్తు చేశారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వై.ఎస్. తో పాటు జగన్ బాబు మంచోడేనని.. ఎప్పుడైతే బయటికి వచ్చారో అప్పుడే కేసులు పెట్టారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని క్షోభకు గురి చేశారన్నారు. వై.ఎస్. మరణం తర్వాత ఓదార్పు యాత్ర చేస్తానని జగన్ బాబు మాటిచ్చారని.. అందుకోసం ఎన్ని కష్టాలెదురైనా నిలబడ్డాడని విజయమ్మ తెలిపారు. ప్రత్యేక హోదా కోసం, జనం కష్టాలు తీరడం కోసం జగన్ బాబు ఎన్నో దీక్షలు చేశారని గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో చంద్రబాబుకు ప్రజలు గుర్తొచ్చారని, ఇప్పుడే సంక్షేమం గుర్తు కొచ్చిందని విజయమ్మ దుయ్యబట్టారు. వై.ఎస్. ఉన్నప్పుడు తానెప్పుడూ బయటకు రాలేదన్నారు. జగన్ బాబును జైల్లో పెట్టినప్పుడు 18 మందిని గెలిపించుకోవడానికి బయటికి వచ్చానన్నారు. జగన్ బాబు నిత్యం మీ మధ్యే ఉన్నాడని.. అనుకుంటే ఏదైనా సాధిస్తాడని విజయమ్మ తెలిపారు.

 

రాజారెడ్డిని ఎవరు చంపారో అందిరికీ తెలుసన్నారు విజయమ్మ. అలాగే వై.ఎస్. మృతిపైనా అనుమానాలున్నాయన్నారు. 4 నెలల క్రితం విశాఖ ఎయిర్ పోర్టులో గుండు సూది కూడా వెళ్లనిచోట కత్తితో జగన్ పై దాడి చేశారన్నారు. తాజాగా వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశారన్నారు. అయినా మీ ఆశీర్వాద బలమే జగన్ ను ముందుకు నడిపిస్తోందని విజయమ్మ తెలిపారు. వివేకానంద హత్య విషయంలో జగన్ పై ఆరోపణలు చేస్తున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన హత్యపై సిబిఐ విచారణ కానీ, థర్డ్ పార్టీ కానీ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సీబీఐ ఎంక్వైరీకి చంద్రబాబు ఎందుకు వెనుకాడుతున్నారని విజయమ్మ ప్రశ్నించారు. నాడు చంద్రబాబుపై బాంబు దాడి జరిగితే వై.ఎస్. ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

జగన్ బాబు ప్రకటించిన నవరత్నాల ద్వారా అందరికీ లబ్ది చేకూరుతుందని విజయమ్మ చెప్పారు. జగన్ బాబు చెప్పినట్టే 3 దశల్లో మద్యపానం నిషేధం చేస్తారని తెలియజేశారు. అందుకే జగన్ బాబును ఒక్కసారి ఆశీర్వదించాలని విజయమ్మ కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: