
ఆహారాన్ని వృథా చేయవద్దన్నది చైనా అధ్యక్షుడి ప్రస్తుత ప్రచారం. ఎందుకంటే, చైనా దేశవ్యాప్తంగా గత కొన్ని వారాల నుంచి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. దక్షిణ చైనాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పంట పొలాలు నాశనం అయ్యాయి. టన్నుల కొద్ది ఆహార ధాన్యాలు వృధా అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ రంగంలోకి దిగారు. క్లీన్ ప్లేట్ క్యాంపేన్‌ను జీ జిన్‌పింగ్ ప్రారంభించారు. ఆహారం వృధా అవుతున్న తీరు షాకింగ్‌గా ఉందని, చాలా నిరుత్సాహపరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కోవిడ్19 వల్ల ఆహారం వృదాపై అప్రమత్తం కావాల్సి వస్తుందన్నారు. ఆహార భద్రత సంక్షోభం రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పిలుపుతో.. వుహాన్ క్యాటరింగ్ పరిశ్రమ సంఘం ఓ నిర్ణయం తీసుకున్నది. రెస్టారెంట్లకు వచ్చిన వారికి ఒక డిష్‌ను తక్కువగా సర్వ్ చేయాలని నిర్ణయించాయి. గుంపుగా రెస్టారెంట్లకు వెళ్లేవారు.. ఒక డిష్‌ను తక్కువగా ఆర్డర్ చేయాలన్న సంకేతాలను జారీ చేశారు. అంటే ఉదాహరణకు పది మంది విందుకు వెళ్తే.. వాళ్లు కేవలం 9 ప్లేట్ల ఆహారాన్ని మాత్రం ఆర్డర్ చేయాలన్న నిబంధన విధించారు.
ఇదిలాఉండగా, చైనా అధ్యక్షుడి ఐడియాను వ్యతిరేకిస్తూ ఆన్‌లైన్‌లో విమర్శలను మొదలయ్యాయి. గతంలోనూ యాంటీ ఫుడ్ వేస్ట్ క్యాంపేన్ చైనాలో చేపట్టారు. 2013లో ఇలాంటి ప్రచారమే సాగింది. అయితే అప్పుడు కేవలం భారీ భారీ విందులను మాత్రమే టార్గెట్ చేస్తూ ఆంక్షలను అమలు చేశారు. అయినప్పటికీ మార్పు రాలేదు. చైనా లెక్కల ప్రకారం.. 2015లో ఆ దేశంలో సుమారు 18 మిలియన్ టన్నుల ఆహారం వృధా అయింది. ఇప్పుడు మళ్లీ అదే ముచ్చట తెరమీదకు వచ్చింది.