
ధర్మసందేహాలు చాలా చిత్రంగాను, విచిత్రంగాను ఉంటాయి. పైకి వాటిలో ఏదో భారీ సూక్ష్మం దాగి ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ, సూక్ష్మం అవగతమయ్యాక.. `ఓస్ ఇంతేనా?!` అని అనిపించక పోదు! అంతేకాదు, కొన్నికొన్ని సందేహాలు ఆయా గ్రంథాలపై, ఇతిహాసాలపై కూడా ప్రభావం చూపించిన సందర్భాలు ఉన్నాయి. ఇక, రానురాను.. ఆయా ధర్మసందేహాల్లో ఉన్న మర్మం మాట అటుంచితే.. అవే ప్రజల నోళ్లలో పడి నానుడిగా మారినవి కూడా ఉన్నాయి. ఇలాంటి వాటిలో ఇప్పటికీ తరచుగా వినిపించే ఒక నానుడి.. `రామాయణం అంతా విని.. రాముడికి సీత ఏమవుతుంది.. అన్నట్టుగా ఉంది`!! అనే మాట.
ఈ నానుడి మనకు పల్లెటూళ్లలోనే కాకుండా పట్టణాల్లోనూ వినిపిస్తూ ఉంటుంది. మరి ఈ నానుడి వెనుక ఉన్న సూక్ష్మం ఏంటి? రామాయణం అంతా విని.. రాముడికి సీత ఏమవుతుందని అడిగితే ఏం చెప్పాలి? అంటే.. ఈ సూక్ష్మం వెనుక ఉన్న పరమార్ధం.. అంతరార్థం.. `వ్యక్తి శ్రద్ధ.. బుద్ధి కుశలత`కు పెట్టే పరీక్షే! ఏదైనా ఒక విషయాన్ని లేదా ఒక పుస్తకాన్ని ఏదో చదివామంటే.. చదివాం.. అని కాకుండా.. వాటిని శ్రద్ధగా చదవడం.. లేదా తెలుసుకోవడం.. అలా చదివిన లేదా తెలుసుకున్న విషయాన్ని మన బుద్ధిని వినియోగించి అర్ధం చేసుకోవడం అనే కీలక సూత్రాన్ని రామాయణం ప్రతి ఒక్కరికీ నేర్పుతుంది.
సీతారాముల కళ్యాణం నుంచి తిరిగి ఏక కాంతగా, నిండు గర్భిణిగా సీతాదేవి వనవాసానికి వచ్చే వరకు ఉన్న మధ్యకాలంలో కేవలం పదిమాసాల సమయం మాత్రమే.. రాముడి వియోగాన్ని భరించింది. రావణాసురుడు సీతాదేవిని మోహించడం, ఆమెను అపహరించడం, తర్వాత రాముడు హనుమ సాయంతో సీతాదేవి జాడను గుర్తించడం, రామ-రావణ యుద్ధం తెలిసిందే. అంటే.. రావణాసురుడు సీతను అపహరించిన సమయం నుంచి రాముడు తిరిగి సీతాదేవిని గ్రహించేవరకు మధ్యలో గడిచిన సమయంలో కేవలం పదిమాసాలు. దీనిని పక్కన పెడితే.. తిరిగి సీతాదేవిని రాముడే స్వయంగా అడవుల్లో విడిచిపెట్టమని సోదరుడైన లక్ష్మణ స్వామిని ఆదేశించేవరకు ఆమె రాముడి వెంటే ఉన్నది.
అయితే, రాముడు-సీత కలిసి ఉన్న సమయంలో ఒకరినొకరు అనుగమించారు. రాముడి మనసే సీతమ్మ, సీతమ్మ మనసే రామయ్యగా జీవితాలను పంచుకున్నారు. ఈ జగత్తుకే ఆదర్శంగా నిలిచారు. అంతగా వారు ఒకరిపై ఒకరు మమకారం పెట్టుకున్నారు. సీత అపహరణకు గురైన విషయం తెలియడంతో ``రామో దాశరధి శ్శూరో..`` అంటూ కీర్తిపొంది.. మారీచ, సుబాహుల వంటి భయంకరమైన రాక్షసులను తరిమికొట్టి, తాటక వధ చేసిన రాముడు.. బిక్కటిల్లిపోయి.. కన్నీరు పెట్టినా, పదిమాసాల పాటు పరాయి రాజ్యంలో ఉన్నప్పటికీ.. సీతమ్మపై ఇసుమంతైనా సందేహం లేకపోవడం వెనుక.. రాముడి మనసులో సీత స్థానం.. అవగతం అవుతుంది.
సూటిపోటి మాటలతో వేధించే రాక్షస స్త్రీలు ఒకవైపు, రాముడిని కించపరుస్తూ.. తూలనాడే రావణాసురుడు మరోవైపు తన మనసును ఛిద్రం చేస్తున్నా.. రాముడు ఉన్నాడో లేడో.. వస్తాడో.. రాడో అని సందేహించక.. తన రాముడు తప్పకుండా వచ్చితీరుతాడని భావించిన సీతమ్మ మనసులో రాముడి స్థానం చెప్పకనే చెబుతుంది రామాయణం. అందుకే రామాయణం పూర్తిగా చదివి సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే.. రాముడి మనసు.. సీతదగ్గర.. సీతమనసు రాముడి దగ్గర ఉన్నదనే విషయం అర్ధమవుతుంది. అంటే.. ఆ ఇద్దరూ వేరు కాదు.. ఒక్కరే! తనువులు వేరైనా.. వారిరువురూ ఒక్కరే అనే అర్ధం తెలుస్తుంది. ఇది చెప్పడానికే మనవాళ్లు.. రాముడికి సీత ఏమవుతుంది? అనే నానుడి వాడతారు. ఏదైనా విషయం అంతా విని కూడా అర్ధంకానట్టు మొహం పెట్టేవారి విషయంలో ఇలాంటి నానుడులు వాడడం మనకు కనిపిస్తూనే ఉంటుంది.