ఒంగోలు: వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును ప్రశ్నించిన జనసేన కార్యకర్త వెంగయ్య మరణించిన విషయం తెలిసిందే. వెంగయ్య మరణంపై జనసేన పార్టీ పోరాడుతోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెంగయ్య కుటుంబానికి న్యాయం జరిగేందుకు పోరాటం చేయనున్నారు. నేడు ఒంగోలు ఎస్పీని కలిసి వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఆయన అనుచరులపై కేసు పెట్టనున్నారు. కాసేపటి కిందట వెంగయ్య కుటుంబ సభ్యులను కలిసి పవన్ కల్యాణ్ పరామర్శించారు. వెంగయ్య కటుంబానికి ఆర్థిక సహాయంగా పవన్ కల్యాణ్ రూ. 8.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. అంతే కాకుండా వెంగయ్య పిల్లల చదువు ఖర్చును మొత్తం తానే భరించనున్నట్టు చెప్పారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. ఏం తప్పుచేశాడని వెంగయ్య ప్రాణాలు కోల్పోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సమస్యపై ఎమ్మెల్యేని అడిగినందుకు ఆయన మాటలకు మానసిక వేదనకు గురయ్యాడని అన్నారు. వెంగయ్య ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే చంపేశారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైసీపీ నేతల కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి ఘటనలపై ఆలోచించుకోవాలని అన్నారు. ప్రశ్నించే వారి కుటుంబాలను నాశనం చేయాలనుకుంటే కుదరదని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. దాష్టీకాలు ఎక్కువవుతూ ఉంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని పేర్కొన్నారు. ‘జగన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే చేసిన పనికి శిక్షిస్తారా? మీకు ఆ ధైర్యం ఉందా? అన్నా రాంబాబు గుర్తుంచుకో.. నిన్ను పాతాళానికి తొక్కేస్తాం.

వెంగయ్య మృతి వైసీపీ పతనానికి నాంది అని అన్నారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై మీ చానెల్స్‌లో వేసుకోండి.. మీ పేపర్స్ లో రాసుకోండి.. మీరు జర్నలిస్టులను కూడా వదలటం లేదు.. మీరు అనుకున్న వాళ్లే జర్నలిస్టులా.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా.. ఫ్యూడలిస్ట్ వ్యవస్థలో ఉన్నామా? జగన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: