
దేశంలో ఓ వైపు కరోనా కేసులు.. మరోవైను తుఫాన్లు, వరదలతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఎడతెగని వరదలు అసోం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ప్రభావంతో 50 మంది ప్రాణాలు పోయాయి. ఇప్పటి వరకు 27 జిల్లాల్లో 22 లక్షల మందికి పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు. జాతీయ విపత్తు నిర్వహణ దళం, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళ సిబ్బంది, స్థానిక పరిపాలన అధికారులతో కలిసి బాధిత ప్రజలను రక్షించడానికి, వారికి సహాయక సామగ్రి అందజేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. గత ఏడాది కూడా ఇక్కడ వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలో కరోనా రక్కసి విళయతాండవం చేస్తుంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వరదలు అతలాకుతలం చేస్తున్నాయి.
వరదల వల్ల 103,806 హెక్టార్ల పంట పొలాలు కోతకు గురయ్యాయి. 2,763 గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. 20 జిల్లాల్లో ఏర్పాటు చేసిన 480 సహాయ శిబిరాల ద్వారా 61 వేల మంది ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మపుత్రతో పాటు ఇతర నదులు ప్రమాదస్థాయిలను దాటి ప్రవహిస్తున్నాయి. ఇక వరద బీభత్సం.. ధెమాజీ, ఉదల్గురి, బిశ్వనాథ్, సోనిత్పూర్, బక్సా, లఖింపూర్, చిరాంగ్, బార్పేట, బొంగాగావ్, కోక్రాజార్, గోల్పారా, కమ్రూప్, గోలఘాట్, జోర్హాట్, శివసాగర్, మజులీ, దిబ్రూగర్, వెస్ట్ కర్బీ ఆంగ్లాంగ్, కర్బి ఆంగ్లాంగ్, టిన్సుకియా జిల్లాల్లో కొనసాగుతుంది.
దక్షిణ సల్మారాలో 1.92 లక్షలు, ధేమాజీలో 1.30 లక్షల మంది వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 18 జిల్లాల్లోని వివిధ ప్రదేశాలలో కట్టలు, రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. వరద కారణంగా అనేక వందల ఇళ్ళు పూర్తిగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ సల్మారాలో 1.92 లక్షలు, ధేమాజీలో 1.30 లక్షల మంది వరదల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.