తెలంగాణాలో గవర్నర్ కు కేసీయార్ మధ్య వివాదం బాగా ముదిరిపోతోంది. రాజ్ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన గవర్నర్ తమిళిసై రాష్ట్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తనకు ప్రైవసీ లేకుండాపోతోందంటు మండిపడ్డారు. ప్రైవసీ లేకుండా ఏమైందంటే తన ఫోన్ను కూడా ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందేమో అనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. తన ఫోనే ట్యాపింగ్ జరుగుతోందనే అనుమానాన్ని ఏకంగా గవర్నరే వ్యక్తంచేశారంటే చిన్న విషయంకాదు.

ఈ విషయాన్ని మొన్నటి ఢిల్లీ టూర్లో కచ్చితంగా ఫిర్యాదుచేసే ఉంటారనటంలో సందేహంలేదు. నాలుగురోజుల పాటు గవర్నర్ ఢిల్లీలో అనేకమందిని కలిసిన విషయం అందరికీ తెలిసిందే. తన పర్యటనలో హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అయ్యారు. మీడియా సమావేశంలోనే తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే అనుమానాన్ని వ్యక్తంచేసిన గవర్నర్ ఇదే విషయమై అమిత్ షా కు ఫిర్యాదు చేయకుండా ఉంటారా ? మీడియా సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ పై అనుమానం వ్యక్తంచేసిన గవర్నర్  అందుకు ఆధారాలపై మాత్రం ఏమీ మాట్లాడలేదు.

అయితే అమిత్ షా ను కలిసినపుడు పూర్తి ఆధారాలను అందించుంటారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు లేకుండా కేవలం అనుమానాలను మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యక్తంచేయలేరు కదా. అసలు తన ఫోన్ ట్యాప్ అవుతోందనే అనుమానం ఎప్పుడొచ్చింది ? ఏ సందర్భంగా వచ్చింది ? అనుమానం నిజమైందా అన్న విషయాలను మీడియాకు గవర్నర్ వివరించలేదు.

అయితే ఇందుకు సంబందించిన పూర్తి వివరాలను గవర్నర్ కేంద్రప్రభుత్వానికి అందించి ఉంటారనటంలో సందేహంలేదు. ఏదో సంచలనం కోసమే ప్రభుత్వంపై ఆరోపణలు చేశారా ? లేకపోతే నిజంగానే గవర్నర్ ఫోన్ ట్యాపవుతోందా అన్న విషయమై క్లారిటిలేదు. ఏదేమైనా ఫోన్ ట్యాపింగ్ అన్నది చిన్న విషయమైతే కాదు. గతంలో ఇలాంటి ఆరోపణలతో కర్నాటక ప్రభుత్వమే కూలిపోయింది. ఇదే సందర్భంగా రాజ్ భవన్ అంటే ప్రగతిభవన్ కాదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజ్ భవన్లోకి సమస్యలు చెప్పుకునేవారు ఎవరైనా రావచ్చంటు గట్టిగానే చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: