గుంటూరు జిల్లాలో చంద్రబాబునాయుడుకు కొత్త తలనొప్పి మొదలైందా ? మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మీడియా సమావేశం చూసిన తర్వాత అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లిచ్చేది లేదని సీనియర్లకు ఒకవైపు చంద్రబాబు గట్టిగా చెబుతుంటే రాయపాటేమో ఏకంగా మూడు టికెట్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. సీనియర్ తమ్ముళ్ళు చింతకాయల, గంటా, పూసపాటి, జేసీ, కేఈ, భూమా లాంటి వాళ్ళు చాలామంది తమ కుటుంబాల్లో రెండేసి టికెట్లు కావాలని చంద్రబాబుపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు.





అయితే వీరిలో ఎవరికీ రెండు టికెట్లు ఇచ్చేదిలేదని ఇప్పటికైతే చంద్రబాబు స్పష్టంగానే చెప్పేశారు. పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ కు మాత్రమే ఫ్యామిలీ ప్యాకేజీలో మినహాయింపిచ్చారు. దాన్ని చూపించే మిగిలిన నేతలు రెండు టికెట్లకోసం పట్టుబడుతున్నారు. ఈ విషయాలన్నీ చూస్తూ కూడా రాయపాటి మూడు టికెట్లు అడగటమే ఆశ్చర్యంగా ఉంది. తనంతటా తాను నాలుగు అడుగులు వేయలేకపోయినా నరసరావుపేట ఎంపీగా తానే పోటీచేస్తారట.





కొడుకు రంగబాబుకు పెదకూరపాడు లేదా సత్తెనపల్లిలో ఎక్కడో ఒకచోట అసెంబ్లీ టికెట్ కావాలట. చివరగా తన తమ్ముడు రాయపాటి శ్రీనివాస్  కూతురు శైలజకు కూడా టికెట్ కావాలట. ఇక్కడ గమనించాల్సిందేమంటే సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లో రెగ్యలర్ గా కన్నా లక్ష్మీనారాయణ తిరుగుతున్నారు. పై రెండింటిలో ఎక్కడో ఒకచోట కన్నా పోటీచేయటం ఖాయమనిపిస్తోంది. రాయపాటి-కన్నా మధ్య భయంకరమైన శతృత్వం ఉన్న విషయం తెలిసిందే.





అందుకనే కన్నా కన్నేసిన నియోజకవర్గాలనే రాయపాటి కూడా అడుగుతున్నారు. అయితే పార్టీవర్గాల సమాచరం ప్రకారం రాయపాటి కుటుంబానికి ఒక్క టికెట్ దక్కితే అదే చాలా ఎక్కువట. ఇస్తే గిస్తే శైలజకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే ఈమె అమారవతి జేఏసీ ఆందోళనల్లో రెగ్యులర్ గా పాల్గొన్నారు. డాక్టర్ కూడా అయిన శైలజ అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలనే ఆందోళనల్లో బాగా హైలైట్ అయ్యారు. అయినా రాయపాటి ఫ్యామిలీకే మూడు టికెట్లిచ్చేస్తే మరి మిగిలిన నేతలు ఏమైపోవాలి. అడిగినట్లుగా టికెట్లు ఇవ్వకపోతే రాయపాటి ఏమిచేస్తారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: