సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్. ఎన్నో సినిమాల్లో హీరోగా విలక్షణమైన నటనతో, తన స్టైల్‌తో ప్రపంచపు ఎల్లలను తుడిచేసిన మరీ అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్.. ప్రతి సినిమా ఓ వండర్. చిన్న, పెద్ద తేడా లేకుండా తెరకెక్కించిన ప్రతి చిత్రం అద్భుతమనే చెప్పాలి. ఆయన తీసే సినిమాలు.. అందులోని పాత్రలూ ప్రేక్షకుడి ఊహకే అందవు. మరి వీరిద్దరూ కలిస్తే... ఇక బాక్సాఫీసు వద్ద రచ్చరచ్చే. అదే జరిగింది 2010లో. శంకర్ డైరెక్షన్‌లో 60 ఏళ్ల రజినీతో రోబో(తమిళంలో యన్‌తిరన్) సినిమా తీసి ప్రపంచ సినిమా రంగాన్నే భారత్ వైపు తిరిగి చూసేలా చేసింది. భారత సినిమా రంగం కూడా ప్రపంచ స్థాయి సినిమాలు తెరకెక్కించగలదని నిరూపించడానికి మూల కారణం ఈ సినిమా అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

శంకర్-రజినీ కాంబోలో 2007లో మొదటి సారి ఓ సినిమా తెరకెక్కింది. అదే ‘శివాజి: the boss’. ఈ సినిమాలో 57 ఏళ్ల రజినీని ఫుల్ లెంగ్త్ ఎనర్జిటిక్ రోల్‌లో చూపించాడు శంకర్. రజినీ కూడా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత మూడేళ్ల గ్యాప్‌ తీసుకుని మళ్లీ రజినీతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు శంకర్. ‘రోబో’ అనే ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో ఓ కథను తీసుకుని రజినీ వద్దకు వెళ్లారు. కథ రజినీకి కూడా నచ్చింది. కానీ తన వయసు నేపథ్యంలో ఈ సినిమా చేయగలనా..? అనే అనుమానం వ్యక్తం చేశారు. దానికి శంకర్.. అంతా తనపై వదిలిపెట్టమని భరోసా ఇచ్చి సినిమా మొదలు పెట్టారు. సినిమా పూర్తయింది. 

2010 అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. అప్పటివరకు ఓ ఇండియన్ సినిమా ఎన్నడూ చూడని స్థాయిలో వసూళ్లు సాధించింది. భారత చిత్ర పరిశ్రమలో ఏ సినిమా సాధించని వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. అప్పట్లో దాదాపు  రూ.150 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 250 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాదు భారతీయ ప్రేక్షకులు ఎన్నడూ చూడని ఓ విజువల్ వండర్‌ను వెండితెరపై ఆవిష్కరించాడు శంకర్. శంకర్-రజినీల ఈ సినిమాకు ప్రపంచ సినీ రంగం సైతం సలాం చేసింది. ఎన్నో అవార్డులను ఈ సినిమా గెలుచుకుంది.

రోబో తరువాత రజినీ-శంకర్ కాంబోలో 2018వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. దానికి తోడు అప్పటికే వారిద్దరూ రోబో 2.0 సినిమా చేస్తున్నారని తెలియడం, అందులో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని తెలియడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగినట్లే 2018 నవంబర్ 29న రోబో 2.0 రిలీజైంది. ఈ సినిమా కూడా కోట్ల కలెక్షన్లు సాధించింది. మొత్తంగా రూ.500 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 800 కోట్ల వరకు వసూలు చేసింది.

అయితే మొదటి భాగం అంతగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నా.. కథ కొంత వీక్‌గా ఉండడంతో ఈ సినిమాపై మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినా వసూళ్లలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు.
మరి ఇలాంటి అదిరిపోయే సినిమాలతో ప్రేక్షకులను అలరించి శంకర్-రజినీ మళ్లీ ఎప్పుడు కలిసి సినిమా చేస్తారో చూడాలి. ఒకవేళ వీరిద్దరూ మళ్లీ రోబో 3.0 చేస్తారేమో మరి..!

మరింత సమాచారం తెలుసుకోండి: