దశాబ్దాల తరువాత ఆ నాటి మహానటి సావిత్రిని వెండితెరపై మళ్లీ ఆవిష్కరించిన సినిమా మహానటి. సావిత్రి కీర్తి సురేశ్ పాత్రలో నటించింది. కాదు జీవించింది. అలనాటి సావిత్రిని మళ్లీ కళ్లకు కట్టినట్లు చూపించింది. అయితే ఈ క్రెడిట్ అంతా కీర్తి సురేశ్‌కే దక్కదు. ఆమెను అలా తీర్చి దిద్దిన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌కు అందులో సగ భాగం దక్కుతుంది. నిజానికి కీర్తి సురేశ్‌లో మహానటిని నాగ్ అశ్విన్ ముందుగా గుర్తించాడట. మూడేళ్ల పాటు కష్టపడి మహానటి కథను తయారు చేసుకున్న నాగ్ అశ్విన్.. సావిత్రి పాత్రకు ఎవరైతే సరిపోతారా..? అని కథ రాస్తుండగానే వెదకడం ప్రారంభించాడట. 

ఈ క్రమంలోనే అతడికి కీర్తి సురేశ్ తారసపడింది. అప్పటికే తెలుగులో నేను శైలజ, నేను లోకల్ వంటి సినిమాలతో అటు అందంలోనూ, అభినయంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. కీర్తి. దానికి తోడు సావిత్రిలానే గుండ్రటి ముఖంతో బొద్దుగా ఉండడంతో ఆమెనే తీసుకోవాలని అశ్విన్ నిర్ణయంచుకున్నాడట.

మహానటి పాత్ర ముందుగా కీర్తికి చెబితే కొంత భయపడిందట. కానీ అలాంటి పాత్ర మళ్లీ తనకు రాదని, జీవితంలో వచ్చిన ఓ గొప్ప అవకాశంగా భావించి ఓకే చెప్పిందట. దాంతో అప్పటి నుంచి కీర్తిని సావిత్రిగా మలిచేందుకు అశ్విన్ చాలా కష్టపడ్డాడట. ఆమె మాట్లాడే తీరు, చూసే విధానం, నవ్వు, నడక.. అన్నింటినీ చాలా జాగ్రత్తగా మార్పులు చేస్తూ.. చివరికి సినిమాలో మనం చూసిన ‘మహానటి’ కీర్తి సురేశ్‌ని ఆవిష్కరించాడు.

 సినిమాలో సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ.. వంటి అనేకమంద స్టార్ నటులున్నా.. నాగ్ అశ్విన్ ఫోకస్ అంతా కీర్తి సురేశ్ పైనే ఉండేదట. ఆమె నటనలో ఏ మాత్రం తేడా రాకుండా ప్రతి షాట్‌ను ఎంతో జాగ్రత్తగా తీసేవాడట. అందుకే సినిమా అంతబాగా వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌కు నూటికి నూరు మార్కులు పడ్డాయి.  

కాగా.. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రభాస్‌తో ఓ ప్యాన్ ఇండియా సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడు. దానికోసం కథ, స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇక కీర్తి సురేశ్ బాగా సన్నబడి గ్లామర్ పాత్రలకూ ఓకే చెబుతోంది. ప్రస్తుతం మహేశ్‌ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. అలాగే అన్నాత్తే సినిమాలో రజినీ కాంత్ సోదరిగా చేస్తోంది. మరిన్ని ప్రాజెక్టులు కూడా సైన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: