సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఆసక్తి రేకిత్తిస్తున్న మరో రాష్ట్రం పశ్చిమ బెంగాల్. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ కంచుకోటగా మారిన ఈ రాష్ట్రంలో పాగా వేసేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. నాడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న ఈ తీరరాష్ట్రంలో ఇప్పుడు ఆ పార్టీ ప్రభావం అంతంతమాత్రమే. మరి ఇప్పుడు అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది..?

 

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికొచ్చి తృణమూల్ కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న మమత.. పశ్చిమ బెంగాల్ లో అధికారం కోసం కమ్యూనిస్టులపై పోరాటం చేశారు. కమ్యూనిస్టులను కనుమరుగు చేసేశారు. ఎర్రదండు ఇప్పుడు ఉనికి కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక కామ్రేడ్లు, కాంగ్రెస్ తో కలిసి జవసత్వాలు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కి, కమ్యూనిస్టులకు మధ్య విభేదాలు తలెత్తాయి.. దీంతో ఎవరికి వారే ఒంటరిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.

 

బెంగాల్ లో తృణమూల్ కి దీటుగా ఎదిగేందుకు బీజేపీ  తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ బెంగాల్ మీద ప్రత్యేక దృష్టిపెట్టారు. బీజేపీ, బెంగాల్ కి సంబంధించి ఇప్పటికే 28 మంది అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసేసింది. బెంగాల్ లో బీజేపీ బలపడితే తమకు ముప్పేనని గ్రహించిన మమతా బెనర్జీ.. వీలు చిక్కినప్పుడల్లా ప్రధానిపై విరుచుకుపడుతున్నారు. మోడీని దెబ్బకొట్టేందుకు జాతీయ స్థాయిలో కూటమి అంటూ హడావుడి చేస్తున్నారు.

 

జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు విషయంలో అత్యంత ఉత్సాహం చూపించే మమతా బెనర్జీ.. బెంగాల్ లో మాత్రం ఇతర పార్టీలను ఏమాత్రం దగ్గరకు రానివ్వడంలేదు. అటు కాంగ్రెస్ తో కానీ.. ఇటు కమ్యూనిస్టులతో గానీ.. ఆమె ఎటువంటి పొత్తు పెట్టుకోలేదు. ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు. మొత్తం 42 సీట్లకుగాను గత ఎన్నికల్లో తృణమూల్ 34 సీట్లు గెల్చుకుంది. బెంగాల్ లో తన ప్రత్యర్థుల మధ్య పొత్తు లేకపోవడమే తమకు బలమని బీజేపీ భావిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం 2 సీట్లు గెల్చుకున్న బీజేపీ ఈసారి 10 స్థానాల వరకు చేజిక్కుంచుకోవాలని పావులు కదుపుతోంది.  2018 పంచాయతీ ఎన్నికలు.. బీజేపీకి కాస్త ఊపిరి పోశాయి. ఆ పార్టీ టీఎంసీకి గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. కానీ.. కమ్యూనిస్టులను, కాంగ్రెస్ ను పక్కకు నెట్టి రెండో స్థానానికి చేరుకుంది.

 

2014లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం వల్ల ఉత్తర బెంగాల్ లో ఈ కూటమి సత్తా చాటుకోగలిగింది. ఈసారి పొత్తు లేకపోవడం వల్ల అక్కడ సీట్లు చీలీపోయే అవకాశం ఉంది. అది తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇతర కేంద్ర మంత్రలు తరచూ బెంగాల్ లో పర్యటిస్తూ.. అక్కడ తమ పార్టీకి సానూకుల పరిస్థితులు ఏర్పరిచేందుకు ప్రయత్నంచారు. వారిని అడ్డుకునేందుకు మమత తీవ్ర ప్రయత్నాలే చేశారు.  మరి బెంగాల్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఇప్పుడు ఆసక్తికంరగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: