రాజకీయ నాయకులు ఒకప్పుడు పూర్తిగా ప్రజల పైన, తమకున్న మంచి పేరుపైన ఆధారపడి ఎన్నికలకు వెళ్లే వారు.. కానీ నేటి కాలంలో అటు ఓటర్లలో.. ఇటు నాయకుల్లో కూడా తెలివితేటలు బాగా పెరిగాయి. దీంతో ఎన్నికలకు వెళ్లే ముందే ప్లాన్ రచించి.. ప్రజల్లో విజయం సాధించాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వ్యూహకర్తలకు డిమాండ్ ఊపందుకుంది.. పార్టీలకు నేడు వ్యూహకర్తలే వెన్నెముకగా మారుతున్నారు..


అయితే ఈ పార్టీలు, అభ్యర్థుల వెనుక వ్యూహాలు రచించేవారు కొందరు ఉన్నారు.. నియోజకవర్గాల్లో డేటా సేకరించడం, విశ్లేషించడం, సమీక్షించడం, ట్రెండ్ కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం.. ఇవన్నీ తెర వెనుక చేస్తున్నారు రాజకీయ వ్యూహకర్తలు.. నిత్యం ఇదే పనిపై ఉంటూ తమ పార్టీ గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారు.. వాళ్లకు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో సహాయకులుగా ఉంటున్నారు.. వాళ్లతో పాటు పరిశోధకులు, డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు తమవంతు కృషి చేస్తున్నారు.


ప్రస్తుతం ఏపీలో ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ, నేషనల్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అనే రెండు సంస్థలు పని చేస్తున్నాయి.. దాదాపు 70 నుంచి 80 మంది ఉద్యోగులతో ఐ ప్యాక్ వైసీపీకి పని చేస్తుంటే.. 150 మంది ఉద్యోగులతో ఎన్ ప్యాక్ జనసేనకు పని చేస్తుంది.. ఈ రెండు సంస్థలు 2014 ఎన్నికల్లో బీజేపీకి పని చేయడం విశేషం..


ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ కు స్ట్రాటజీలు రచించడం.. వాటిని అమలు పరచడంలో దిట్ట.. ఇక శాస్త్రీయంగా ఖచ్చితత్వంలో ముందుకెళ్లడం ఎన్ ప్యాక్ ప్రత్యేకత. బూత్ లెవల్ కమిటీ ఏర్పాటు, శిక్షణ, సమస్య గుర్తింపు, పరిష్కారం వార్ రూమ్ మేనేజ్ మెంట్ వంటి అనేక కొత్త అంశాలతో ఎన్ ప్యాక్ సేవలు అందిస్తోంది. బీజేపీ దేశంలో ఏవిధంగా విస్తరించిందన్న ఎన్ ప్యాక్ అధినేత దేవ్ కు పూర్తి అవగాహన ఉంది.. అదే పద్దతి ఆయన జనసేనకు వర్తింప జేస్తున్నారు..


ఐప్యాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే 2014 లోక్ సభ, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో గెలుపులు వంటివి ఈయన అకౌంట్ లో ఉన్నాయి.. కొత్త తరహా స్ట్రాటజీలు రూపొందించడం, నాయకులకు ప్రజలు మెచ్చేలా ఉపన్యసించడంలో శిక్షణ ఇవ్వడం, పార్టీ కేడర్ లో స్ఫూర్తిని రగిలించేందుకు స్వయంగా రంగంలోకి దిగి పార్టీ నేతలకు మోటివేషన్ వంటివి ఐ ప్యాక్ కు ప్లస్ పాయింట్లు..


ఈ సంస్థలు తమ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ వ్యూహాలు అందిస్తున్నాయి.. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దాని చుట్టూ ప్రసంగాలు, విమర్శలు, కౌంటర్లు ఉండేలా వ్యూహాలు పన్నుతున్నాయి.. అలాగే ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన సమస్యలు, ఓటు బ్యాంకు బట్టీ స్పందించేలా అభ్యర్థికి వ్యూహాలు సూచిస్తున్నాయి. దీంతో పాటు సోషల్ మీడియాలో ప్రజలను ఆకట్టుకునేందుకు కీలక నేతల ప్రసంగాలను అప్ డేట్ చేస్తుంటారు. మొత్తానికి ఎన్నికల్లో గెలుపు కోసం ఇలా కన్సల్టెన్సీలకు భారీ స్థాయి మూల్యం చెల్లించుకుంటూనే.. రాజకీయ నతేలు, పార్టీలు నడుచుకునే పరిస్థితి వచ్చేసింది. మరి ఈ సలహా సంస్థలు ఈ పార్టీలను ఏ మేరకు గట్టెక్కిస్తాయో చూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: