తెలంగాణలో టీఆర్ఎస్ హవాను తట్టుకొని కొన్ని స్థానాలైనా గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకొని ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది.. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ దిగ్గజాలు తెలంగాణలో జరగబోయే ఎన్నికల ప్రచారంలో దూకుడుగా ప్రచారం చేస్తారని భావించిన టీ.కాంగ్రెస్ నేతలకు అధిష్టానం తీసుకున్న నిర్ణయం నిరాశకు గురి చేస్తోంది.

తెలంగాణపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే కీలక నేతలంతా పార్టీకి బైబై చెప్పేస్తుండటంతో.. ఉన్నవారిలో మానసిక స్థైర్యం నింపేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల చేత ప్రచారం చేయిద్దామనుకున్న టీపీసీసీ నేతలకు షాక్ తగిలింది.. తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రియాంక గాంధీ పేరు లేకపోవడంతో హస్తం నేతలను నిరాశకు గురి చేసింది.

ఒకప్పుడు తెలంగాణలోని మెదక్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోలికలు ఉన్న ప్రియాంక గాంధీతో.. తెలంగాణ అంతటా లోక్ సభ ఎన్నికల ప్రచారం చేయించాలని కాంగ్రెస్ నేతలు భావించారు. ప్రియాంక గాంధీతో రెండు, మూడు సభలైనా ఏర్పాటు చేయించాలని.. ఆమె వస్తే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరగడంతో పార్టీ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం నెలకొంటుందని టీపీసీసీ నేతలు భావించారు.. ఇదే విషయాన్ని అధిష్టానం పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు.. అయితే కాంగ్రెస్ నాయకత్వం మాత్రం ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రియాంక గాంధీ పేరును మినహాయించింది.

కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చకపోవడం వెనుక అసలు వేరే కారణం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రియాంక గాంధీ సేవలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో వినియోగించుకోవాలని భావిస్తోంది.. మరోవైపు ప్రచారానికి ఎక్కువ సమయం లేకపోవడం వల్లే ప్రియాంకను తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి మినహాయించారని హస్తం నేతలు చెబుతున్నారు.. మొత్తానికి తెలంగాణలో టీఆర్ఎస్ కు గట్టి కౌంటర్ ప్రియాంక గాంధీ ఇస్తుందని భావించినా.. ఇటువైపు రాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులను నిరాశకు గురి చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: