బీజేపీ అంటే నిన్నమొన్నటివరకూ వాజ్ పేయి, అద్వానీయే గుర్తొస్తారు. కానీ ఇప్పుడు బీజేపీ అంటే మోదీ – అమిత్ షా మాత్రమే. ఇప్పుడు పార్టీలో వారిద్దరూ సుప్రీమ్. వాళ్లు చెప్పిందే వేదం. వాజ్ పేయి, అద్వానీ నేతృత్వంలో పార్టీ నడిచిన తీరు ఓ విధంగా ఉంటే ఇప్పుడు వారి పంథాకు పూర్తి భిన్నంగా నడుస్తోంది. మోదీ – షా ద్వయం పార్టీని పూర్తిగా తమదైన శైలిలో నడిపించేందుకు వ్యూహాలు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ ప్యామిలీయే గుర్తొస్తుంది. వాస్తవానికి అది గాంధీ వారసత్వం కూడా కాదు. కానీ గాంధీ పేరుతోనే నెహ్రూ కుటుంబీకులు చెలామణీ అవుతున్నారు. ఇది బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్. బీజేపీలో కుటుంబస్వామ్య పరిపాలన కనిపించదు. వారసత్వం అక్కడక్కడా మాత్రమే దర్శనమిస్తుంది తప్పితే తరాల తరబడి బీజేపీలో కొనసాగుతున్న వాళ్లు తక్కువే. అయితే ఉన్న ఆ కాస్త వారసత్వాన్ని కూడా తుంచేయాలనుకుంటోంది బీజేపీ కొత్త నాయకత్వం. తాజా ఎన్నికల్లో వారసత్వ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెడుతూ బీజేపీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

75 ఏళ్లకు మించిన వాళ్లు రాజకీయాల నుంచి రిటెర్మెంట్ అవ్వాలని గతంలో బీజేపీ నినదించింది. ఇప్పుడు ఆ నినాదాన్ని తూ.చ. తప్పకుండా అమలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో 75 ఏళ్లు దాటిన నేతలెవ్వరికీ సీట్లు కేటాయించడంలేదు. కనీసం తమ వారసులకు సీట్లు ఇవ్వాలని కొంతమంది నేతలు కోరినా సున్నితంగా తిరస్కరిస్తోంది అధిష్టానం. ఒకటి, రెండు కుటుంబాలకు మాత్రమే ఈ మినహాయింపు లభించింది. సీనియర్ నేత ఎల్.కె.అద్వానీకి ఈ ఎన్నికల్లో సీట్ లభించలేదు. ఆయన వయస్సు 91 ఏళ్లు. మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి కూడా టికెట్ ఇవ్వలేదు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ 76వ ఏట అడుగు పెట్టడంతో ఆమెకి కూడా టికెట్ దక్కలేదు. ఆమె వడోదరా నుంచి 8 సార్లు గెలుపొందడం విశేషం. అయినా టికెట్ దక్కలేదు. ఈ నిబంధనతోనే నజ్మాహెప్తుల్లా, కల్ రాజ్ మిశ్రా, అనంది బెన్ పటేల్.. తదితరులకు టికెట్ దక్కలేదు.

అయితే వయస్సు కారణంగా టిక్కెట్లు దక్కించుకోలేకపోతున్న కొందరు నేతలు తమ వారసుల్ని రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు. దీనికి కూడా బీజేపీ అధినాయకత్వం చెక్ పెట్టింది. కొంతకాలం క్రితం కర్ణాటకకు చెందిన కేంద్రమంత్రి అనంతకుమార్ మరణించారు. ఆయన సీటు ఆయన భార్య తేజశ్వికి దక్కుతుందని అంతా భావించారు. కానీ బీజేపీ హైకమాండ్ అందుకు భిన్నంగా తేజశ్వీ సూర్య అనే కొత్త యువకుడిని తెర మీదకు తీసుకొచ్చింది. అయితే వారసత్వం విషయంలో ఒక్క కుటుంబానికి మాత్రం మినహాయింపు ఇచ్చింది బీజేపీ హైకమాండ్. మేనకా గాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీలకు ఈసారి కూడా అవకాశం కల్పించారు. అయితే వారిద్దరి సీట్లు పరస్పరం మార్చారు. బహుశా వీళ్లిద్దరూ గాంధీ కుటుంబానికి చెందినవారు కావడంతో వారి వారసత్వాన్ని కొనసాగించాలనుకున్నారో ఏమో.. వాళ్లకు మాత్రమే ఆ ఛాన్స్ దక్కింది.


మరింత సమాచారం తెలుసుకోండి: