నవ భారత నిర్మాణం కోసం మరోసారి బీజేపీని గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. మహబూబ్ నగర్ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. 60 నెలలపాటు చౌకీదార్ గా సేవలందించినట్టు చెప్పారు. అందుకే మరోసారి మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకొచ్చానని చెప్పారు. ఐదేళ్ల బీజేపీ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేసినట్టు మోదీ చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ సహా ఇతర పార్టీల పాలనను 60 ఏళ్ల పాటు చూశారని, కానీ ఈ ఐదేళ్లలో 60 ఏళ్లలో సాధించిన అభివృద్ధి కంటే ఎక్కువే సాధించామని మోదీ చెప్పారు. మౌలిక సదుపాయాల నుంచి యాంటీ శాటిలైట్ వరకు అనేక విషయాల్లో విజయం సాధించామన్నారు. కశ్మీరులో ఒక ప్రాంతానికే ఉగ్రవాదాన్ని పరిమితం చేశామని.. దేశ సరిహద్దులు దాటి ఉగ్రవాదాన్ని తిప్పికొడుతున్నామని చెప్పారు. దేశ ప్రజల సంక్షేమం కోసం వ్యక్తిగత విమర్శలు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. నవభారత నిర్మాణం కోసం మరోసారి బీజేపీని గెలిపించాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రత్యర్ధి పార్టీల నాయకులెవరో తెలియదని.. వారి విధానమేంటో కూడా తెలీదని ఎద్దేవా చేశారు. కుటుంబ ప్రయోజనాల కోసమే అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తాము నిజాయితీతో దేశంకోసం నిబద్ధతో పనిచేస్తున్నామని చెప్పారు.


తెలంగాణలో ఏం జరుగుతోందో దేశం మొత్తం గమనిస్తోందని పరోక్షంగా కేసీఆర్ ను విమర్శించారు మోదీ. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోయారో తెలియదని ఎద్దేవా చేశారు. అంతేకాక.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి మూడు నెలలు పట్టిందని విమర్శించారు. ఓ జ్యోతిష్యుడు చెప్తేనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని.. ఆ జ్యోతిష్యుడి సలహాతోనే 3 నెలలపాటు కేబినెట్ ఏర్పాటు చేయకుండా పాలన గాలికొదిలేశారని ఆరోపించారు. ఎంపీ ఎలక్షన్ల ఓటమి నుంచి తప్పుకోడానికే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. మే లో పార్లమెంటుతో కలిపి ఎన్నికలు జరిగినట్టయితే కేసీఆర్ జాతకం బాగుండదని జ్యోతిష్యుడు చెప్పారని.. మోదీ ప్రభ ముందు మీరు నిలబడలేరని చెప్తే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ఆక్షేపించారు. తెలంగాణలో వందల కోట్ల ప్రజాధనం వృధా అయిందని మోదీ విమర్శించారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగి ఉంటే ప్రజాధనం వృధా అయ్యేది కాదని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తును ప్రజలు నిర్ణయించాలా లేక జ్యోతిష్యుడు నిర్ణయించాలా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ -టీఆర్ఎస్ వేర్వేరు కాదని ఒకే గూటి పక్షులని మోదీ విమర్శించారు. ఆ రెండు పార్టీలూ కుటుంబం కోసమే పని చేస్తున్నాయన్నారు. అవినీతి కాంగ్రెస్ కు జనం వీడ్కోలు చెప్తున్నారని.. భారత సైన్యం ప్రతిభను కూడా కాంగ్రెస్ శంకిస్తోందని దుయ్యబట్టారు. పాలమూరు ప్రజల వల్ల కేసీఆర్ కు మేలు చేస్తే.. ఇక్కడి ప్రజలకు ఆయన ఏమీ చేయలేదన్నారు. ఆయన మాత్రం తన కూతురికి, కొడుక్కి, అల్లుడికి న్యాయం చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్-ఎంఐఎం కూటమి రాజ్యాంగ విరుద్ధంగా పనిచేస్తోందని విమర్శించారు. రాజ్యాంగంలోని లేని ముస్లిం రిజర్వేషన్లను కేసీఆర్ పదేపదే ప్రస్తావించడం ఎవరి మేలుకోసమో ఆలోచించాలని మోదీ సూచించారు. ఎన్డీయే పథకాలను కేసీఆర్ తన పథకాలుగా చెప్పుకుంటున్నారని.. అయినా బాధ లేదన్నారు. పేదలకు న్యాయం జరిగితే చాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి, దాన్ని అటకెక్కించారని ఆరోపించారు. దేశమంతా ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదవారికి వైద్యం చేస్తుంటే.. తెలంగాణలో ఆ పథకం అక్కర్లేదని కేసీఆర్ అడ్డుకున్నారని మోదీ వివరించారు.

అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత చౌకీదార్ ప్రభుత్వానిదేనని మోదీ చెప్పారు. ఒకపక్క దమ్ దార్, చౌకీదార్ ప్రభుత్వం- మరోపక్క అవినీతి, వారసత్వ రాజకీయం ఉన్నాయని.. ఏది కావాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: