
తొలిదశ పోలింగ్ కు సమయం దగ్గరపడింది. మరో 3 రోజుల్లో అంటే 11వ తేదీన 91 పార్లమెంటు నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అంటే దాదాపుగా లోక్ సభలోని ఐదో వంతు స్థానాల్లో ప్రజలు తీర్పు చెప్పబోతున్నారు. అధికారం మాదంటే మాదంటూ.. గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ లు తొలిదశ ఎన్నికలపై భారీగానే దృష్టిపెట్టాయి. అయితే.. ఫస్ట్ ఫేజ్ లో ఎన్నికలు జరిగే.. నియోజకవర్గాల్లో బీజేపీకి తీవ్ర నిరాశ తప్పదన్న అంచనాలు వెలువడుతున్నాయి.
మొదటి దశలో 20 రాష్ట్రాలకు చెందిన మొత్తం 91 పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని 42 స్థానాలు తీసేస్తే 18 రాష్ట్రాల్లో 49 స్థానాలున్నాయి. ఇందులో పార్లమెంట్‌లో ఎక్కువ ప్రభావాన్ని చూపించే రాష్ట్రాల్లో ఒకటి ఉత్తర్‌ప్రదేశ్. ఈ రాష్ట్రం నుంచి మొదటి దశలో 8 నియోజకవర్గాల్లో ఎన్నికలున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ.. యూపీలో అత్యధిక సీట్లు గెలిచింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కూటమిగా పోటీ చేస్తున్న బీఎస్పీ, ఎస్పీ బలమైన ప్రత్యర్థులుగా ముందుకొచ్చి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. మరో వైపు కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తోంది.
ఇక ఉత్తరాఖండ్‌లో బీజేపీ పరిస్థితి కొంత ఫరవాలేదు. ఒడిశాలో కల్హండి, నవరంగ్‌పూర్, బ్రహ్మపుర, కోరాపుట్‌లలో ఎన్నికలున్నాయి. ఇక్కడ ప్రాంతీయ పార్టీ బీజేడీ బలంగా ఉంది. 48 పార్లమెంటు సీట్లున్న మహారాష్ట్రలోని ఏడు నియోజకవర్గాల్లో మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అక్కడ రైతు ఉద్యమాలు బీజేపీని కలవరపెడుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, మిజోరామ్, నాగాలాండ్, సిక్కింలలో ఉన్న ఒక్కో నియోజకవర్గంలో ప్రాంతీయ పార్టీలకే గానీ బీజేపీకి అవకాశం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. తొలిదశలో ఎన్నికలు జరిగే త్రిపుర పశ్చిమ నియోజకవర్గంలో సిపిఎంకు చెందిన సిట్టింగ్ ఎంపీ శంకర్‌ప్రసాద్ దత్త బలమైన అభ్యర్థిగా ఉన్నారు. మణిపూర్‌లో ఉన్న రెండు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మేఘాలయలో ఉన్న రెండు నియోజకవర్గాల్లోనూ ప్రాంతీయ పార్టీ ఎన్‌పిఇపితో పాటు కాంగ్రెస్‌కు పట్టుంది. అండమాన్ నికోబార్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పటికీ.. అక్కడ కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. లక్షద్వీప్‌లో సిట్టింగ్ ఎన్సీపీ అభ్యర్థి. ఇక్కడ కాంగ్రెస్, ఎస్పీ, సిపిఎం తర్వాతే బీజేపీ స్థానం. జమ్మూ కాశ్మీర్ మొదటి దశ ఎన్నికల్లో ఉన్న జమ్మూ, బారాముల్లా నియోజకవర్గాల నుంచి గతంలో జమ్మూలో బీజేపీ గెలవగా, బారాముల్లాలో జెకెపిడిపి విజయం సాధించింది. ఇక్కడ జమ్మూ తప్పించి బీజేపీకి సానుకూలత కనిపించడం లేదు.
ఏపీలో 25, తెలంగాణలో 17 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ప్రధాన పోటీ అంతా.. టీడీపీ, వైసీపీ, జనసేనల మధ్యే నెలకొంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఇక్కడ పెద్దగా ప్రభావం లేదు. తెలంగాణాలో 17 లోక్‌సభ స్థానాలుండగా.. బీజేపీకి ఒకటీ రెండు స్థానాల్లో తప్పించి విజయావకాశాలు లేవు. 2018 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితాలొచ్చాయి. కాబట్టి తొలి దశలో ఎన్నికలు జరిగే 91 నియోజకవర్గాల్లో బీజేపీకి 10కి మించి స్థానాలు దక్కే అవకాశం లేదనేది విశ్లేషకుల మాట.