
రాహుల్ గాంధి విదేశీ పౌరుడంటూ గత కొంతకాలంగా వస్తోన్న ఆరోపణలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ విషయంపై ఆయనకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ విషయంలో వాస్తవాలేంటో రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని రాహుల్‌ను ఆదేశించింది.

రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరుడంటూ ఆయనపై కొన్నేళ్లుగా సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధికి నాలుగు పాస్ పోర్టులు ఉన్నాయనీ, అందులో ఒకటి రాహుల్ విన్సీ పేరు తోనూ, ఆయన మతం క్రిస్టియన్ గానూ ఉందంటూ ఇటీవల సుబ్రహ్మణ్యస్వామి స్వామి దుమారం రేపారు. ఏడు దశల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు సరిగ్గా పతాకస్థాయికి చేరుకుంటున్న తరుణంలోనే కేంద్రం ఆయనకు నోటీసులు జారీచేయడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని అమేథితో పాటు కేరళలో వయనాడ్ నుంచి రాహుల్ పోటీచేస్తున్నారు.

డా.సుబ్రహ్మణ్యస్వామి నుంచి అందుకున్న ఫిర్యాదు మేరకు మేం మీకు (రాహుల్ గాంధి) ఈ ఆదేశాలు జారీ చేస్తున్నాం. "బ్యాకప్స్ లిమిటెడ్" పేరిట యునైటెడ్ కింగ్‌డమ్ లో రిజిస్టరైన కంపెనీ, 51 సౌత్‌గేట్ స్ట్రీట్, వించెస్టర్, హ్యాంప్‌షైర్ ఎస్‌వో23 9ఈహెచ్ అడ్రస్‌తో ఉన్నఆ కంపెనీకి మీరూ ఒక డైరెక్టరుగా నమోదు కోసం సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారని ఆయన హోంశాఖ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే 10/10/2005 నుంచి 31/10/2006 మధ్య కంపెనీ వార్షిక రిటర్నుల్లో మీ పుట్టిన తేదీ 19/06/1970 అని, మీ జాతీయత బ్రిటిష్ గా పేర్కొన్నారని ఫిర్యాదులో తెలిపారు. కంపెనీ మూసివేత కోసం చేసుకున్న దరఖాస్తులోనూ మీ జాతీయత ను బ్రిటిష్‌గా తెలిపినట్లు వివరించారు" అని హోంమంత్రిత్వ శాఖ పౌరసత్వ విభాగం డైరెక్టర్ బీసీ జోషీ రాహుల్ గాంధికి రాసిన లేఖలో వివరించారు. సుబ్రహ్మణ్యస్వామి హోంశాఖకు అందించిన ఆధారాలను కూడా లేఖకు జత చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై నిజా నిజాలేంటో తెలియజేస్తూ రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు.

రాహుల్ గాంధీ భారతీయుడు కాదని, ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం ఉందని భాజపా ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి గత కొంత కాలంగా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఆధారాలను 2015 లో స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు ఆయన అందజేశారు. వాటి ఆధారంగా రాహుల్ గాంధిను ఎంపీకి అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై అప్పట్లో దుమారం రేగడంతో తాను భారతీయుడినే నని రాహుల్ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించుకోవాల్సి వచ్చింది. .

గాంధీ కుటుంబంపై తరచూ తీవ్రస్థాయిలో విరుచుకుపడే సుబ్రహ్మణ్య స్వామి రాహుల్ పౌరసత్వంపై 2015 లో తొలిసారి ఆరోపణలు లేవనెత్తారు. అది మొదలు తరచూ రాహుల్ గాంధీపై ఇదే తరహా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కాగా 2016లో ఈ విషయమై రాహుల్ గాంధి స్పందిస్తూ, స్వామి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారనీ, ఆయన ఆరోపణలకు ఆధారాలు ఉంటే చూపాలని సవాల్ విసిరారు. కాగా రాహుల్‌కు కేంద్రం జారీచేసిన తాజా నోటీసులపై కాంగ్రెస్ నేత సంజయ్ ఝా మాట్లాడుతూ, "తీవ్ర భయాందోళనల కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఇలాంటి కట్టుకథలు అల్లుతున్నారు" అని నిందా పూరిత వ్యాఖ్యలు చేశారు.