
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీటీడీ అధికారులు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గం మూసివేశారు. ఇక తిరుమల, తిరుపతిలో ఉండిపోయిన భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బస, భోజన సదుపాయం కల్పించాలని అధికారులను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. తిరుమల, తిరుమతి రెండో ఘాట్ రోడ్ మరమ్మతు పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని సూచించారు. తిరుమలలో ఉన్న భక్తులు... వారికి కేటాయించిన వసతి గదుల్లోనే బస చేయాలని సూచించారు ఈవో. ప్రతి ఒక్కరికీ భోజనం అందుతుందని ఈవో వెల్లడించారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తిరుపతిలో ఉండిపోయిన భక్తులు శ్రీనివాసం, గోవిందరాజస్వామి సత్రం, పద్మావతి నిలయంలో బస చేయవచ్చన్నారు. ఇప్పటికే శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ ద్వారా దర్శనం బుక్ చేసుకున్న వారికి స్వామి వారి దర్శన భాగ్యం తప్పకుండా కలిగిస్తామన్నారు. భక్తులు ఆన్ లైన్ టికెట్ తీసుకువస్తే సరిపోతుందన్నారు. ఈ విషయంపై భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి. ఇక తిరుమలలో పరిస్థితి దారుణంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.