కర్నాటకలో హిజాబ్ వివాదం చినికి చినికి గాలివానలా మారిన సంగతి తెలిసిందే. ఓవైపు కోర్టులో విచారణ జరుగుతుండగా.. మరోవైపు గొడవలు పెరగడంతో కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవు ప్రకటించి సంయమనం పాటించాల్సిందిగా కోరింది. ఈ దశలో రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్లు ఈ గొడవకు మరింత ఆజ్యాన్ని పోస్తున్నాయి. సున్నితమైన అంశంపై ఎవరికి వారే తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది.

హిజాబ్ కి మద్దతుగా, మహిళా లోకానికి మద్దతుగా ప్రియాంక ట్వీట్ చేసింది. అయితే అందులో ఆమె వాడిన పదజాలం కాస్త ఇబ్బందిగా మారింది. హిజాబ్ కానీ, జీన్స్ కానీ, బికినీ కానీ.. మహిళలకు ఏదైనా వేసుకునే హక్కుంది. భారత రాజ్యాంగం ప్రకారం ఈ హక్కుని ఎవరూ కాదనడానికి లేదు అంటూ ట్వీట్ చేశారు ప్రియాంక. అయితే ఈ ట్వీట్ లో బికినీ అనే పదం అభ్యంతరకరంగా ఉందంటూ బీజేపీ, ఆ పార్టీ అనుకూల సంఘాలు ప్రియాంకను ట్రోల్ చేస్తున్నాయి.


 

బికినీ సంప్రదాయం ఎందుకు..?
హిజాబ్ ని సమర్థించే క్రమంలో బికినీని ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నిస్తున్నారు కొంతమంది. ప్రియాంక గాంధీని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బికినీ వేసుకుని విద్యాసంస్థలకు రావాలని మీరు పిల్లలకు సూచిస్తున్నారా అంటూ ఘాటుగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రియాంక గాంధీకి పలు సభలు, మీడియా సమావేశాల్లో కూడా ఈ ప్రశ్న ఎదురవుతోంది. దీంతో ఆమె కొంత అసహనానికి గురవుతున్నారు.

అదే సమయంలో హిజాబ్ ని వ్యతిరేకిస్తున్నవారిపై కూడా చాలామంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలు పెట్టారు. హిజాబ్ ని వ్యతిరేకిస్తూ భారతీయ సంప్రదాయాల గురించి చెబుతున్నవారంతా అసలు సంప్రదాయ దుస్తుల్లో బయటకు వస్తున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారికి హిజాబ్ గురించి మాట్లాడే అర్హత లేదంటున్నారు. మొత్తమ్మీద ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. హిజాబ్ ని సమర్థించేవారు, వ్యతిరేకించేవారు.. సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చకు తెరలేపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: