రాహూల్ గాంధికి రెండేళ్ళు జైలుశిక్ష విధించటంపై సుప్రింకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది ? రాహూల్ పై పడిన అనర్హత వేటు ఏమవుతుంది ? అనేది పెద్ద పజిల్ అయిపోయింది. సరే ఈ రెండు విషయాలను పక్కన పెట్టేస్తే గడచిన మూడురోజులుగా ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అదేమిటంటే తెలంగాణా కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి రావటం. ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తున్న సీనియర్ నేతలంతా ఒకచోట చేరి ఆందోళనల్లో పాల్గొంటున్నారు.





పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చాలామంది సీనియర్లు తీవ్రంగా విభేదిస్తున్న విషయం బహిరంగమే. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జగ్గారెడ్డి, మహేశ్వరరెడ్డి, భట్టీ విక్రమార్క, కోదండరెడ్డి లాంటి చాలామంది రేవంత్ ను వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళెవరూ రేవంత్ ను పీసీసీ అద్యక్షుడిగా లెక్కేచేయటంలేదు. రేవంత్ పాల్గొన్న సమావేశాల్లో తాము పాల్గొనేది లేదని తీర్మానం కూడా చేశారు.





సీనియర్లు అప్పట్లో చేసిన తీర్మానం పార్టీలో సంచలనంగా మారింది. అలాంటి పరిస్ధితి నుండి ఇపుడు అందరు చేయి చేయి పట్టుకుని ఆందోళనల్లో పాల్గొంటున్నారు. రాహూల్ కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని కోమటిరెడ్డి ప్రకటించటం, అధిష్టానం ఆదేశిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ ప్రకటించటం అందరికీ తెలిసిందే. ప్రాణత్యాగాలు, రాజీనామాల ప్రకటనలతో ద్వితీయ శ్రేణి నేతలతో పాటు క్యాడర్లో ఫుల్లు జోష్ వచ్చేసింది.





మొహాలు చూసుకోవటానికి కూడా ఇష్టపడని చాలామంది సీనియర్లు ఇపుడు ఒకేచోట కూర్చుని ఆందోళనలు చేస్తున్నారంటే, అన్నా అన్నా అని మాట్లాడుకుంటున్నారంటే ఆ ఘనత కచ్చితంగా నరేంద్రమోడీకి మాత్రమే దక్కుతుంది. సీనియర్లందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని అధిష్టానం ఎంత ప్రయత్నించినా సాధ్యంకానిది  మోడీ వల్లైంది. మొత్తానికి ఎవరికి వారే యమునా తీరా అన్నట్లుగా సాగుతున్న కాంగ్రెస్ లోని సీనియర్లందరినీ ఏకంచేసిన క్రెడిట్ మోడీకి మాత్రమే దక్కుతుందనటంలో సందేహంలేదు. కాకపోతే సీనియర్లలో ఈ ఐక్యత ఎంతకాలం ఉంటుందన్నది వేరే విషయం.  


మరింత సమాచారం తెలుసుకోండి: