సిద్దిపేట సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి. సిద్ధిపేట లేనిదే కేసీఆర్ లేడని... కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. సిద్ధిపేట లేనిదే కేసీఆర్ లేడనే విషయం నిజమని... కానీ కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదనే మాట మాత్రం అవాస్తవమని చెప్పారు. సోనియా లేకుంటే కేసీఆర్ ఎక్కడ ఉండేవారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ అహంకారానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనమని మండిపడ్డారు.

 సోనియాగాంధీ ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదని... తెలంగాణ రాకపోతే కేసీఆర్ ఇంత అహంకారంతో మాట్లాడేవారా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.  సోనియా, రాహుల్ తెలంగాణ ఇవ్వకపోతే ఈ రోజు కేసీఆర్ ఇలా మాట్లాడేవాడా అని నిలదీశారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు కేసీఆర్ కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదని విమర్శించారు. సిద్ధిపేట, గజ్వేల్ మినహా మెదక్ జిల్లాలో ఇతర నియోజకవర్గాలు కేసీఆర్ పట్టించుకోవడం లేదని జగ్గారెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను కూడా కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ఆ నియోజకవర్గాలకు నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. దీనిపై మెదక్ జిల్లా ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.  

 టీఆర్‌ఎస్‌తో బీజేపీకి రాజకీయ చీకటి ఒప్పందం ఉందని జగ్గారెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ఇక్కడ బీజేపీని విమర్శించి .. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలుస్తారని విమర్శించారు. కేసీఆర్‌ కొత్త సచివాలయాన్ని కడుతున్నందునే.. మోడీ నిర్మిస్తున్న పార్లమెంట్‌ భవనాన్ని సమర్థిస్తున్నారని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: