
ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా అన్న పేరు చెపితేనే అందరూ భయపడిపోతున్నారు. కరోనా దెబ్బతో వాళ్లు లేదు.. వీళ్లూ లేదు. ఎవరైనా సరే దీనికి తలవంచాల్సిందే. ప్రభుత్వాలు.. సెలబ్రిటీలు.. ప్రపంచం అంతా కరోనా గుప్పెట్లోకి వెళ్లిపోతోంది. వారం రోజుల వరకు కరోనా అంటే మన దేశం పెద్దగా భయపడ లేదు. ఇక ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలోనూ కరోనా కోరలు చాస్తోంది. మహారాష్ట్ర, కేరళ, కర్నాటకలో కరోనా విలయ తాండవం చేస్తోంది. తాజాగా కరోనా సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. ఉక్రెయిన్‌లో జన్మించిన నటి, మోడల్ ఓల్గా కురెలెంకో తనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చినట్టు వెల్లడించింది.
ఓల్గా గతంలో జేమ్స్‌బాండ్ సీరిస్ సినిమాల్లో సైతం నటించింది. 2008 జేమ్స్‌బాండ్ మూవీ క్వాంటం ఆఫ్ సొలేస్‌లో ఓల్గా కురెలెంకో నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే 2013లో వచ్చిన సైఫై సినిమాలో సైతం ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక గత వారం రోజులుగా ఆమె తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆమె హాస్పటల్ కు వెళ్లగా అక్కడ కరోనా టెస్ట్ చేయగా... ఆమెకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని ఓల్గా (40) తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పేర్కొన్నారు.
వారం రోజుల నుంచి జ్వరం, తీవ్ర అలసటతో తాను బాధపడుతున్నానని.. ప్రతి ఒక్కరు కూడా కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించింది. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గతవారం కరోనా వైరస్‌ను అంతర్జాతీయ మహమ్మారిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే హాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ టామ్ హ్యాంక్స్, రీటా విల్సన్‌లకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక ఈ లిస్టులో ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు. మరి ఈ వైరస్ ఎప్పుడు తగ్గు ముఖం పడుతుందో ? ప్రపంచం ఎప్పుడు శాంతిస్తుందో ? చూడాలి.