భరతీయ సినిమాపై చెరగని ముద్ర వేసిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. తన సంగీత ఝరితో మూడు దశాబ్దాలుగా భారతీయుల్ని తన్మయత్వానికి గురి చేస్తూనే ఉన్నాడు. ఏఆర్ రెహమాన్ ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నాడంటే ఓ క్యూరియాసిటీ. ప్రేక్షకుల్లో, బిజినెస్ వర్గాల్లో కూడా క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. సంగీతంలో సంచలనాలు సృష్టించిన రెహమాన్ ఇప్పుడు పన్ను ఎగవేత  వివాదంలో చిక్కుకున్నాడు. పన్ను ఎగవేశాడంటూ ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణను స్వీకరించిన హైకోర్టు వివరణ ఇవ్వాలంటూ రెహ్మాన్ కు నోటీసులు జారీ చేసింది.

2011-12 నాటి పన్ను ఎగవేత విషయంలో రెహ్మాన్ నోటీసులు అందుకున్నాడు. 2011లో మూడేళ్ల కాంట్రాక్ట్ కింద రెహమాన్ లిబ్రా అనే బ్రిటన్ టెలికాం కంపెనీకి రింగ్ టోన్స్ సమకూర్చాడు. అందుకు గానూ రెమ్యునరేషన్ కింద అతని అకౌంట్ లో 3.47కోట్లు జమ అయ్యాయి. ఇందుకు సంబంధించి టాక్స్ ఎగవేత ఆరోపణలు రెహమాన్ ఎదుర్కొంటున్నాడు. టాక్స్ కట్టకుండానే రెహమాన్ కు చెందిన చారిటబుల్ ట్రస్ట్ కు ఫండ్స్ ట్రాన్స్ ఫర్ అయ్యాయని దీనికి పన్ను చెల్లించలేదని ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ ఆరోపిస్తోంది. ఆ మొత్తానికి సంబంధించి రెహమాన్ ఇప్పటికీ టాక్స్ చెల్లించలేదని కోర్టుకు విన్నవించింది.


దీంతో జస్టిస్ శివజ్ఞానం, భవానీ సుబ్బరాయన్ బెంచ్ రెహమాన్ కు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా రెహమాన్ పై జీఎస్టీ పన్ను చెల్లించలేదని పిటిషన్ దాఖలైంది. దీనిపై హైకోర్టు అప్పట్లో స్టే విధించింది. ఇప్పుడు మరోసారి పన్ను ఎగవేతపై ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరి.. దీనిపై రెహమాన్ కోర్టుకు ఏం విన్నవిస్తాడో చూడాల్సి ఉంది. రెహమాన్ ప్రస్తుతం తమిళ్ లో విక్రమ్ హీరోగా తెరకెక్కతున్న 58వ  సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: