మరో మూడు నెలల్లో దేశంలోనే అతి పెద్ద రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలు సెమీ ఫైనల్‌ లాంటివి. యూపీలో అధికారంలో ఉన్న పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతుందనేది అన్ని పార్టీల నమ్మకం. ఇందుకోసం ఇప్పటికే అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దాదాపు రెండేళ్లుగా యూపీపైనే స్పెషల్ ఫోకస్ పెట్టాయి అన్ని పార్టీలు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా ఇప్పటికే యూపీని చూట్టేస్తున్నారు. మహిళల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో కూడా విడుదల చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు మహిళలకే కేటాయిస్తామని కూడా ప్రియాంక ప్రకటించారు. ఇక భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే కాషాయ పార్టీ అగ్రనేతలు యూపీలో పర్యటిస్తున్నారు. మెగా ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు కూడా. ఇప్పటికే దివ్య కాశీ - భవ్య కాశీ పేరుతో మోదీ కొత్త నినాదం తెర పైకి తీసుకువచ్చారు.

ఇప్పుడు తాజాగా యూపీలో హిందుత్వ వాదాన్ని నెత్తికెత్తుకున్నారు సమాజ్ వాదీ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. ఇప్పటికే... బీజేపీ ట్రేడ్ మార్క్ అయిన రథయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు అఖిలేష్ యాదవ్. గతంలో యూపీలో రథయాత్ర నిర్వహించారు బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ. ఇప్పుడు అదే బాటలో అఖిలేష్ కూడా ప్రస్తుతం పయనిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆంజనేయ స్వామి చిత్ర పటం ప్రదర్శించిన అఖిలేష్... తాజాగా మరో కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీలో రామ రాజ్యం తన వల్లే సాధ్యమన్నారు. తనకు ప్రతిరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు కలలోకి వస్తున్నారని కూడా అఖిలేష్ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల తర్వాత సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కూడా అఖిలేష్ జోస్యం చెప్పారు. ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే ఎన్నో ఉచిత హామీలను గుమ్మరించారు కూడా. అలాగే ఎన్నికల కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో అఖిలేష్ పొత్తు పెట్టుకున్నారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: