
``ఈడేంట్రాబాబూ.. శకునిగాడిలా ఉన్నాడు``-``రా.. శకుని మామా!``-``ఆడో పెద్ద శకునిగాడ్రా బాబూ``-ఇలాంటి మాటలు తరచుగా సినిమాల్లో వినిపిస్తూనే ఉంటాయి. మరి ఈ శకుని ఎవరు? శకుని మామ అనే పేరు ఎందుకు వచ్చింది? అనేది నేటి తరం యువకులకు పెద్దగా తెలియదు. పైకి ఏదో సినిమా డైలాగు బాగుంది కాబట్టి.. అనేస్తూ ఉంటారు. కానీ, దీనిలో ఉన్న `విషయం` మాత్రం వారికి పెద్దగా అవగాహన లేకపోవడం గమనార్హం. మహాభారతంలో కీలకమైన ధృతరాష్ట్రునికి సొంత బావమరిది శకుని. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌గా పిలవబడే ప్రాంతం మహాభారత కాలంలో గాంధార రాజ్యంగా ఉండేది. ఈ రాజ్యాన్ని శుబల అనే రాజు పాలించేవాడు. ఈయన కుమార్తె.. గాంధారీదేవి, యువరాజు శకుని.
గాంధారిని పుట్టుకతో అంధుడైన ధృతరాష్ట్రుడు వివాహం చేసుకున్నాడు. అయితే, ఈ వివాహ సమయంలో గాంధారీ దేవికి ఉన్న శాపం కారణంగా ముందుగా ఓ మేకతో వివాహం జరిపిస్తారు. అనంతరం దానిని వధించి... తర్వాత.. ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేస్తారు. ఈ విషయం ధృతరాష్ట్రునికి తెలిసినా.. ఇంటిగుట్టు కింద దీనిని రహస్యంగానే ఉంచుతారు. తర్వాత కాలంలో చాన్నాళ్లకు ధృతరాష్ట్రుడు, గాంధారీ దేవిల పుత్రరత్నాలైన కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడికి ఈ విషయం తెలుస్తుంది. ``మీతండ్రి వితంతువును వివాహం చేసుకున్నాడ``నే విమర్శను ఆయన భరించలేక.. ఈ విషయాన్ని దాచిపెట్టి వివాహం చేశారనే నెపంతో గాంధార రాజ్యంపైకి దండెత్తుతాడు.
ఈ క్రమంలోనే గాంధార రాజ్యం రాజు శబల.. అంటే.. దుర్యోధనుడికి సొంత తాత, సొంత మేనమామ శకుని సహా అందరినీ బంధించి తెచ్చి.. తన రాజ్యంలో ఖైదు చేస్తాడు. ఈ క్రమంలో అన్నం కూడా పెట్టకుండా కేవలం మెతుకులు విసిరి వారిని దుర్యోధనుడు తీవ్రంగా అవమానిస్తాడు. దీంతో ఒక్కొక్క మెతుకు తిని తాము అందరం.. చచ్చేకంటే.. ఒక్కముద్దతో అయినా శకునిని బతికించి.. అంతకంతకు దుర్యోధనుడిపై కక్ష తీర్చుకోవాలని గాంధార రాజు నిర్ణయించి.. తామంతా మరణించి.. దుర్యోధనుడు విసిరిన ఒక్కొక్కమెతుకును పోగేసి శకునికి ఆహారంగా ఇస్తారు. అనంతర కాలంలో దుర్యోధనుడు సొంత మేనమామ అయిన శకునిని క్షమించి.. కారాగారం విముక్తుడిని చేస్తాడు.
అయితే, తన వారిని, తన రాజ్యాన్ని తీవ్రంగా అవమానించాడన్న కసితో రగిలిపోయిన శకుని.. సొంత మేనల్లుడికే సలహాదారుగా మారి.. దుర్యోధనుడిని అడగడుగునా అధర్మం వైపు నడిపించి..ప్రత్యక్షంగా సాయం చేస్తున్నట్టుగానే కనిపిస్తూ.. పరోక్షంగా పాండవులకు సహకరిస్తూ..(ఇప్పటి మాటల్లో చెప్పాలంటే.. విలన్ దగ్గరే ఉంటూ.. ఆయన సొమ్మేతింటూ.. హీరోకి అనుకూలంగా వ్యవహరించడం) చివరకు సొంత మేనల్లుళ్లు నాశనం అయ్యేందుకు దోహదకారి అవుతాడు. శకునిదంతా కపట ప్రేమ, కపట మాయాజూదం.. కాబట్టే.. ఆయనను కుట్ర కోణం.. కుళ్లు.. కుతంత్రాల సందర్భాల్లో `శకుని మామ` అని తలుచుకోవడం పరిపాటి. ఇదీ.. శకుని మామ వెనుక ఉన్న స్టోరీ!