
అటు కోటశ్రీనివాస్, తనికెళ్ళ భరణి, సుహాసిని, సుమన్ తదితర నటులు చాలా కీలకమైన పాత్రలు పోషించారు. ఇక ఈ కథ విషయానికి వస్తే రానా (అర్జున్ ప్రసాద్)... ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడు. తన తండ్రి మరణాంతరం అమెరికా నుంచి ఇండియాకు వచ్చి ముఖ్యమంత్రి గా నియామకం అవుతారు. ఈ నేపథ్యంలోనే అసలు అర్జున్ ప్రసాద్ ముఖ్యమంత్రి గా ఎలాంటి అవినీతి లేకుండా పాలన చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. ఇందులో భాగంగానే ప్రజా ప్రతినిధులు మరియు వారి కుటుంబ సభ్యులు ఇతర వ్యాపారస్తుల ఇళ్ళల్లో ఏసీబీ వారితో దర్యాప్తులు చేపిస్తాడు. అన్యాయంగా ప్రజల నుంచి వసూలు చేసిన అక్రమ డబ్బులు వెలికితీసే ప్రయత్నం ఈ సినిమా సారాంశం.
ఈ నల్లధనాన్ని తీసే ప్రయత్నంలో అర్జున్ సింగ్ ప్రసాద్.. ఎదుర్కొనే సమస్యలు, మరియు ప్రస్తుత రాజకీయ కోణాలు మనకు ఈ సినిమాలో కనిపిస్తాయి. ప్రజాధనాన్ని రాజకీయ నాయకులు, అధికారులు ఎలా నొక్కేస్తున్నారో... చూపించే ప్రయత్నాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల కళ్ళకు కట్టినట్లు తీశారు. అలాగే ఒక లీడర్ కు ఉండవలసిన లక్షణాలను జనాల్లోకి తీసుకుపోవడానికి... అర్జున్ ప్రసాద్ క్యారెక్టర్ ను చాలా చక్కగా రూపొందించారు. ఒక లీడర్ అంటే ప్రజల కోసం నిత్యం కష్టపడే వాడే అని ఈ సినిమా ద్వారా నొక్కి చెప్పారు.
అంతేకాదు రాజకీయాల్లోకి యువతను.. ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ మూవీ ని చాలా చక్కగా రూపొందించారు శేఖర్ కమ్ముల. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, జరుగుతున్న అవినీతిని ఎత్తిచూపారు. ఓటు వేసేటప్పుడు ఏ రాజకీయ పార్టీ వద్ద డబ్బులు తీసుకోకూడదని సమాజానికి సారాంశాన్ని ఇచ్చారు. మన నోటుకు అమ్ముడుపోతే.. మన జీవితాలకు రాజకీయ నాయకులు భవిష్యత్తు లేకుండా చేస్తారని కళ్ళకు కట్టినట్లు చూపించారు.