తెలంగాణ రాజకీయ వాతావరణంలో మరోసారి ఉత్కంఠను రేకెత్తించేలా సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ బంధాలు, గుట్టుచప్పుడు కాకుండా జరిగే సమావేశాలపై తరచూ ఆరోపణలు వినిపించేవి. అలాంటి ఆరోపణలకే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా జోరునిచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. “కేటీఆర్ అర్థరాత్రి లోకేష్‌తో డిన్నర్ మీటింగ్ చేశారని వినిపిస్తోంది. నిజమే అయితే దీనిపై స్పష్టత ఇవ్వాలి,” అంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇది రాజకీయ రంగంలో హాట్ టాపిక్‌గానే మారింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత సామ రామ్మోహన్ రెడ్డి కూడా ఇదే ఆరోపణ చేశారు. అప్పట్లో కూడా “కేటీఆర్ జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో టీడీపీ మద్దతు కోరుతూ లోకేష్‌తో సమావేశమయ్యారు,” అని సంచలనం రేపారు.


ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించకపోవడం, ఇంకా ఆసక్తికరంగా మారింది. వారి మౌనం అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పుడు సీఎం రేవంత్ కూడా అదే విషయాన్ని అధికారికంగా ప్రస్తావించడంతో, ఈ భేటీ నిజంగా జరిగిందనే సంకేతాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.జూబ్లిహిల్స్ ఉపఎన్నిక – ఇది ఇంకా ప్రకటించకపోయినా, మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత ఖాళీ అయిన స్థానంగా మారింది. టీడీపీ పోటీ చేసే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నా.. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా టీడీపీ వెళ్లొచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే తాజా పరిస్థితుల్లో టీడీపీ మద్దతు బీఆర్ఎస్‌కు వెళ్లేలా కేటీఆర్ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పైగా మాగంటి కుటుంబసభ్యుడికి టికెట్ ఇచ్చే విషయమై చర్చ జరిగిందని కూడా సమాచారం.



తెలంగాణలో టీడీపీ రాజకీయంగా పెద్దగా బలం లేకపోయినప్పటికీ, బీఆర్ఎస్‌కి మద్దతు ఇవ్వడం లేదా బీజేపీకి అనుకూలంగా లేకపోవడం వంటి విషయాలు కీలక రాజకీయ సంకేతాలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా లోకేష్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తలమునకలై ఉన్న సమయంలో, తెలంగాణలో ఇలాంటి చర్చలు రాజకీయ ప్రయోజనాల కోణంలో గమనించాల్సిన అంశమే. ఇది అన్ని వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ భేటీ నిజమేనా? ఎందుకు జరిగిందా? దాని వెనుక వ్యూహమేమిటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో తేలనున్నాయి. ముఖ్యంగా లోకేష్ లేదా కేటీఆర్ స్పందిస్తే తప్ప – ఈ ఆరోపణలకు పూర్తి స్థాయి క్లారిటీ రాకపోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: