ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొందరలోనే కేసీయార్ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. టీఆర్ఎస్ కాస్త జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారిన విషయం అందరికీ తెలిసిందే. పార్టీ ప్రకటన సందర్భంగా నేతలతో మాట్లాడుతు తొందరలోనే దేశవ్యాప్త పర్యటన మొదలుపెట్టబోతున్నట్లు చెప్పారు. తన పర్యటన మహారాష్ట్ర నుండే మొదలు పెడుతున్నట్లు కూడా ప్రకటించారు.

తొందరలో చేయబోయే పర్యటనను సెకెండ్ ఇన్నింగ్స్ అని అన్నది ఎందుకంట టీఆర్ఎస్ అధినేత హోదాలోనే ఒకసారి నాన్ ఎన్డీయే, బీజేపీయేతర పార్టీల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్న తర్వాత కేసీయార్ ఒక్కసారిగా జాతీయరాజకీయాల్లో దూకుడు పెంచారు. ఈ నేపధ్యంలోనే బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులతో భేటీ అయ్యారు.

అయితే ఎంతమందితో భేటీఅయినా అవేవీ వర్కవుట్ కాలేదు. కేసీయార్లోని చంచల స్వభావమే దీనికి ప్రధాన కారణం. కేసీయార్ ఏరోజు ఎవరితో ఎలాగుంటారో కూడా ఎవరూ ఊహించలేరు. నాన్ బీజేపీ, నాన్ ఎన్డీయే కూటమికి సారధ్యం వహించాలనే ఆలోచన కేసీయార్లో ఉన్నట్లుంది అందుకనే మిగిలిన నేతలెవరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఎందుకంటే దాదాపు ఇలాంటి ఆలోచనలతోనే మమతబెనర్జీ కూడా అందరినీ కలుస్తున్నారు. మమతది కూడా దాదాపు కేసీయార్ స్వాభావమే. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మమత వ్యక్తిత్వం ఎలాంటిదో దేశమంతా చూసింది. ఈ నేపధ్యంలోనే కేసీయార్ మొదటి ఇన్నింగ్స్ ఒకరకంగా ఫెయిల్యూర్ అనే చెప్పాలి. నాన్ కాంగ్రెస్ కూటమి అంటే మాత్రం కేసీయార్ ఎన్ని ఇన్నింగ్సులు ఆడినా సక్సెస్ అయ్యే అవకాశం మాత్రం ఉండదు. తొందరలోనే మొదలుపెట్టబోతున్న రెండో ఇన్నింగ్స్ అన్నా ఒక ప్రణాళిక ప్రకారం ఉంటుందా లేదా అన్నది తేలిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: