ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి తెలంగాణాలో ప్రగతిభవన్ కేంద్రంగా గురువారం చిన్న డెవలప్మెంట్ జరిగింది. అదేమిటంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొందరు బీసీ సంఘాల నేతలు కేసీయార్ తో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ ఏర్పాటును స్వాగతిస్తు, ఏపీలో పార్టీ శాఖ బలోపేతానికి తాము కృషిచేస్తామని హామీ ఇచ్చారు. తాము పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇపుడు మొదలైన చిన్న డెవలప్మెంటే ముందు ముందు సునామీగా మారదని అనుకునేందుకు లేదు.

కృష్ణాజిల్లా గొర్రెల పెంపంకదార్ల సహకారసంఘం మాజీ అధ్యక్షుడు, బీసీ ఫెడరేషన్ ఏపీ అధ్యక్షుడు గురిపర్తి రామకృష్ణ యాదవ్ ప్రగతిభవన్లో కేసీయార్ తో భేటీ అయ్యారు. యాదవ్ నాయకత్వంలో పై రెండుజిల్లాలకు చెందిన బీసీ సంఘాల నేతలు కూడా కేసీయార్ ను కలిశారు. ఇప్పటికే తూర్పుగోదావరి, అనంతపురం, విజయవాడలోని పలువురు బీఆర్ఎస్ ఏర్పాటును స్వాగతిస్తు పెద్దఎత్తున హోర్డింగులను ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.

తెలంగాణాలో లాగే ఏపీలో కూడా కేసీయార్ బీసీ సామాజికవర్గంపై గురిపెట్టినట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే ఏపీ జనాభాలో బీసీలు 50 శాతం ఉన్నారు. వీళ్ళ మద్దతు లేనిదే ఏ పార్టీకి మనుగడ సాధ్యంకాదు. ఇప్పటికే వీళ్ళ మద్దతు పొందాలని చంద్రబాబునాయుడు, నిలుపుకోవాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నదే. వీళ్ళకు పోటీగా కేసీయార్ కూడా బీసీలపైనే గురిపెట్టారు.

తెలంగాణాలో టీఆర్ఎస్ కు బలమైన మద్దతుదారులుగా బీసీల్లోని యాదవులు, గౌడ్లున్నారు. పంచాయితీల నుండి పార్లమెంటు స్ధానాలవరకు బీసీలు బీఆర్ఎస్ కు బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. ఇదే మద్దతును ఏపీలో కూడా అందుకోవాలని కేసీయార్ పెద్ద ప్లానే వేస్తున్నట్లున్నారు. ఇందులో భాగంగానే తనకు సన్నిహితులైన తలసాని శ్రీనివాసయాదవ్ ను ఏపీకి ఇన్చార్జిగా నియమించారని ప్రచారం జరుగుతోంది.

ఇపుడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని బీసీ సంఘాల నేతలు సమావేశమయ్యారంటే తొందరలోనే ఇతర జిల్లాల బీసీ సంఘాల నేతలు కూడా సమావేశమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విజయవాడలో పార్టీ ఆపీసుకు భూమిపూజ చేసేనాటికి బీసీ సంఘాల మద్దతు విషయంలో ఒక క్లారిటి తీసుకోవాలని కేసీయార్ అనుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికి బీసీల మద్దతు కోసం  బీఆర్ఎస్  కూడా గట్టి పోటీదారుగా మారబోతోందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: