కె.ఎ.పాల్... ఈ పేరు ఇప్పుడు తెలుగువాళ్లందరూ తలచుకుంటున్న పేరు. ఎన్నికలకు ముందు నుంచే మీడియాలో తెగ హడావుడి చేసేస్తున్నారీయన.! అయితే ఎవరూ ఈయన మాటలను సీరియస్ గా తీసుకోలేదు. పైగా మాంఛి ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతోందంటూ పాల్ కనిపిస్తే చాలు టీవీల ముందు అతుక్కుపోయారు. సోషల్ మీడియా కూడా పాల్ ప్రెస్ మీట్ల కోసం ఎదురుచూశాయి. అయితే పాల్ లో కొత్తకోణం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకూ ఏంటా కోణం..?

ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఎ.పాల్.! అయితే పేరుకే అది పార్టీ.. ఇన్నాళ్లూ ఆ పార్టీని ఎవరూ సీరియస్ గా తీసుకోలేదు. ఆ.. ఆయన పార్టీ తరపున ఎవరు పోటీ చేసేందుకు ముందుకొస్తారులే అని చాలా లైట్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు నామినేషన్ల స్క్రూటిని మొదలై, ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కే.ఏ.పాల్ ఏం చేశారో తెలుసుకుని అందరూ షాక్ అవుతున్నారు. ముఖ్యంగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ఆయన మేకై కూర్చున్నారు. సుమారు 39 స్థానాల్లో కె.ఎ.పాల్ అభ్యర్థులు గెలుపు ఓటములను ప్రభావితం చేసే సిచ్యుయేషన్ లో ఉన్నారంటే ఆయన ప్లానింగ్, స్ట్రాటజీ అర్థం చేసుకోవచ్చు.

ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్టర్. ఇది దాదాపు ఫ్యాన్ గుర్తును పోలి ఉంటుంది. ఇన్నాళ్లూ ఈ గుర్తు చూసే వైసీపీ భయపడుతూ వచ్చింది. అందుకే పలుమార్లు ఎన్నికల సంఘాన్ని కలిసి పాల్ పార్టీ గుర్తు రద్దు చేయాలని, వేరే గుర్తు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే అది కుదరలేదు. ఇంతలోనే తమ పార్టీ అభ్యర్థులను పోలిసిన పేర్లతోనే పాల్ కూడా అభ్యర్థులను బరిలోకి దించారని తెలుసుకుని వైసీపీ నేతల్లో కంగారు మరింత ఎక్కువైంది. ఇలా చేయడం వల్ల వైసీపీ అభ్యర్థులకు ముందో వెనుకో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఒకరిది ఫ్యాన్, మరొకరిది హెలికాప్టర్. ఈ రెండు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. నిరక్ష్యరాస్యులు, వృద్ధులు ఈ గుర్తుల వద్ద కన్ఫ్యూజన్ కు గురయ్యే ప్రమాదం ఉంది. ఒక వేళ ఫ్యాన్ కు పడాల్సిన ఓట్లు హెలికాప్టర్ కు పడితే వైసీపీకి గట్టి దెబ్బే.!

గుడివాడ, కైకలూరు, పీలేరు, ఒంగోలు, మైలవరం, తణుకు.. ఇలా కీలకమైన నియోజకవర్గాల్లో పాల్ రూపంలో వైసీపీకి ప్రమాదం పొంచి ఉంది. సుమారు 39 అసెంబ్లీ, 4 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇలాంటి ప్రమాదం ఎదురవుతోంది. దీంతో వైసీపీ అప్రమత్తమైంది. పాల్ వెనుక టీడీపీ ఉందని ఆరోపిస్తోంది. పాల్ పార్టీ బీఫారాలన్నీ టీడీపీయే ఇచ్చిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి పాల్ ట్రిక్స్ ఏ మేరకు ఉపయోగపడుతాయో వేచి చూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: