దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. జూలై నుంచి కేసుల తీవ్రత మరింతగా పెరిగిపోతూ వస్తున్నాయి.  దేశంలో ఎప్పుడైతే లాక్ డౌన్ సడలింపులు చేశారో.. ప్రజలు బయటకు రావడం మొదలు పెట్టారు.  కరోనా పూర్తి స్థాయిలో తగ్గకపోవడం.. ప్రజలు తమ కార్యాకలాపాలు కొనసాగించడం మొదలు పెట్టడంతో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని అంటున్నారు అధికారులు.  దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 9,68,876కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 24,915కి పెరిగింది. 3,31,146 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 6,12,815 మంది కోలుకున్నారు. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 32,695 మందికి కొత్తగా కరోనా సోకింది.

 

ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 606 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రజలకు సినీ, క్రీడా, రాజకీయ వర్గానికి చెందిన వారు ఎంతో ధైర్యం చెబుతున్న విషయం తెలిసిందే. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అందరూ ధైర్యవచనాలు పలుకుతున్నారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో  కర్ణాటక ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.   

 

దేవుడు మాత్రమే మనల్ని రక్షించాలి' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.  ప్రస్తుతం మంత్రి శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కూడా అంతర్గతంగా చర్చనీయాంశమయ్యాయి.  కరోనా ఎవరికైనా సోకుతుందని.. దీనికి పేద, ధనిక, కులం, వర్గం అనే భేదాలు ఉండబోవని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజుల వ్యవధిలోనే డబుల్ అవుతాయని తెలిపారు. కేవలం భగవంతుడు మాత్రమే మనల్ని కాపాడగలడని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో కర్ణాటకలోని సొంత బీజేపీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది.  ఏది ఏమైనా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: