కరోనా వ్యాక్సిన్ కొరత అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. అయితే ఇది నేరుగా రాష్ట్రాలు పరిష్కరించుకోగలిగే సమస్య కాదు. రాష్ట్రాలు నేరుగా ఆయా కంపెనీలకు ఆర్డర్ ఇస్తున్నా కూడా ఫలితం లేదు. ముందుగా కేంద్రం ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వ్యాక్సిన్ సరఫరా చేసి, ఆ తర్వాత రాష్ట్రాలకు టీకాలు ఇస్తామంటున్నాయి కంపెనీలు. అయితే అదే సమయంలో ఇటు వ్యాక్సిన్ తొలి డోసు, రెండో డోసు మధ్య అంతరాలు బాగా పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద తోపులాటలు జరుగుతున్నాయి. దీనిపై స్పందించాల్సిన కేంద్రం.. వ్యాక్సిన్ స్పీడ్ పెంచాలంటూ రాష్ట్రాలకు హితబోధ చేస్తోంది కానీ, పంపిణీపై మాత్రం భరోసా కల్పించలేకపోతోంది.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ప్రధాని నరేంద్రమోదీపై అసంతృప్తి వ్యక్తం చేయడానికి ప్రధాన కారణం ఇదే. వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచాలంటూ రాష్ట్రాలకు సూచించిన మోదీ, తమవైపునుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందో మాత్రం తెలియజేయలేదు. అటు ఆక్సిజన్ సరఫరా ప్రస్తావన కూడా తేలేదు. దీంతో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బహిరంగంగానే ప్రధాని మోదీ వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఏపీ సీఎం జగన్, మోదీకి మద్దతు తెలిపేట్టు ట్వీట్ చేసినా.. కళ్లముందు కనపడుతున్న పరిస్థితిని ఎవరూ కాదనలేరు. ఇటు ఏపీలో కూడా వ్యాక్సిన్ నిల్వలు వెక్కిరిస్తున్నాయి. కేంద్రం వ్యాక్సిన్ సరఫరాలో చేతులెత్తేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో పలు చోట్ల వ్యాక్సిన్ కేంద్రాల వద్ద జరుగుతున్న తోపులాటలే దీనికి నిదర్శనం.


 

కేంద్రాన్ని అడగాల్సింది ఎవరు..?
వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత అన్ని రాష్ట్రాలపై ఉంది. అదే సమయంలో వ్యాక్సిన్ లభ్యతపై కూడా రాష్ట్రాలు ఆలోచించాల్సి ఉంది. భారత్ లో వ్యాక్సినేషన్ మొదలైన దొలి దశలో.. ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న ఈ దశలో అందరూ వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. ఈ పరిస్థితి ఒక్కరోజులో వచ్చింది కాదు. అయితే దీన్ని అంచనా వేయడంలో కేంద్రం విఫలమైందనే మాట మాత్రం వాస్తవం. కేవలం కొవాగ్జిన్, కొవిషీల్డ్ పై మాత్రమే ఆధారపడి, మిగతా వ్యాక్సిన్ల అనుమతులపై మీనమేషాలు లెక్కించడం కేంద్రాన్ని విమర్శలపాలుచేస్తోంది. వ్యాక్సిన్ విషయంలో ఇతర దేశాలు ముందు చూపుతో ఉంటే.. భారత్ మాత్రం సకాలంలో వ్యాక్సిన్లు ప్రజలకు అందించడంలో విఫలమైందనే ప్రచారం జరుగుతోంది. ఇకనైనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టాలని కోరుతున్నాయి విపక్షాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: