దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొని ఉంది. ఇదే సమయంలో బీజేపీ కొన్ని ఎత్తుగడలతో పైచేయి సాధించేందుకు వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా దేశంలో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నవారిని తిరిగి తీసుకు వస్తే ఓటు బ్యాంకు పెరుగుతుందనే ఆలోచనలో ఉంది. ఇందుకోసం తీవ్రంగానే శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో లండన్ లో తలదాచుకున్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీలపైనే అందరి దృష్టీ పడింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రుణాలు మోసం చేసి విదేశాలకు పారిపోయారు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ. ఈయన్ను భారత్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఇటీవలే ఆయన లండన్ వీధుల్లో స్వేచ్చగా విహరిస్తున్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు లండన్ పోలీసులు. కోర్టులో హాజరు పరిచారు. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా నీరవ్ మోదీ అప్లై చేసుకున్నారు. అయితే నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

ఇక విజయ్ మాల్యాను ఇప్పటికే భారత్ కు అప్పగించేందుకు లండన్ లోని వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం అంగీకరించింది. దీనికి సంబంధించిన ఫార్మాలిటీలు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ కూడా వెస్ట్ మినిస్టర్ కోర్టు ముందుకు వచ్చింది. విజయ్ మాల్యా కేసును విచారించిన చీఫ్ మెజిస్ట్రేట్ ఎమ్మా ఆర్బుట్ నాట్ నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్ ను కూడా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన సరదా వ్యాఖ్యలు అందరినీ నవ్వుల్లో ముంచెత్తాయి.

నీరవ్ మోదీని కూడా భారత్ కు అప్పగిస్తే ఏ గదిలో ఉంచుతారు..? విజయ్ మాల్యా కోసం సిద్ధం చేసిన గదిలోనే ఉంచుతారా.. ఎలాగా ఆ గది పెద్దగానే ఉంది కదా.. అని వ్యాఖ్యానించారు. భారత్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ న్యాయవాది కూడా ... బహుశా ఆ గదిలోనే ఉంచుతారేమో.. అని అభిప్రాయపడ్డారు. ఇందుకు జడ్జి స్పందిస్తూ.. ఆ గది చాలా పెద్దగా ఉంది సరిపోతుందేమో.. అన్నట్టు నవ్వుతూ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: