ఏపీలో మోదీ పర్యటన తర్వాత బీజేపీ, వైసీపీ మధ్య ఉన్న స్నేహంపై రకరకాల కథనాలు వచ్చాయి. నేరుగా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా జగన్-మోదీ ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, చంద్రబాబుకి ఇక నిద్రపట్టదంటూ సెటైర్లు వేశారు. అంటే బాబు బీజేపీతో స్నేహం కోసం ఎదురు చూస్తున్నారని, కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. వైసీపీతో చెలిమికోరుకుంటుందనేది ఆయన భావన. తాజాగా మరో విషయంలో కూడా ఇది రుజువైంది. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము వైసీపీ సపోర్ట్ కోరలేదని అన్నారు ఏపీ బీజేపీ నేత సత్యకుమార్. దీనిపై వెంటనే కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ క్లారిటీ ఇచ్చారు. తాము వైసీపీ మద్దతు కోరామని చెప్పారు. అంతే కాదు, తమ పార్టీ నేత సత్యకుమార్ ని కూడా అధిష్టానం మందలించినట్టు తెలుస్తోంది. అంటే వైసీపీ విషయంలో బీజేపీ ఎక్కడా ఛాన్స్ తీసుకునేలా లేదు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని ఏపీలోని వైసీపీని తామే కోరామని చెప్పారు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌. తమ పార్టీ నేతలు ఏపీ సీఎం జగన్ తో నేరుగా ఫోన్ లో మాట్లాడారని, ఆయన వివరణ ఇచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక తర్వాత, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు, ఇతర అన్ని ముఖ్య పార్టీల నేతలతో మాట్లాడామని ఆయన చెప్పారు. ఆ సందర్భంలోనే వైసీపీని కూడా సంప్రదించామని, మద్దతు కోరామన్నారు గజేంద్ర సింగ్ షెకావత్. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ ఎవరి మద్దతు కోరలేదని, ముఖ్యంగా వైసీపీ మద్దతు అడగలేదని.. బీజేపీ నేత సత్యకుమార్ అన్నట్టుగా వార్తలొచ్చాయి. ఒకవేళ ఆయన అలా అన్నట్టయితే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావొచ్చని చెప్పారు గజేంద్ర సింగ్ షెకావత్. ఆయన ప్రకటనతో బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదని వివరణ ఇచ్చారు షెకావత్.

రాష్ట్రపతి ఎన్నికలో తాము వైసీపీ మద్దతు కోరలేదంటూ సత్యకుమార్‌ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, ఆ వ్యాఖ్యలను ఖండించారు కేంద్ర మంత్రి షెకావత్. తామే సంప్రదింపులు జరిపామని, నామినేషన్‌ దాఖలు సమయంలో ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా హాజరయ్యారని గుర్తు చేశారు. సత్యకుమార్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. వైసీపీని తీసిపారేసినట్టు సత్యకుమార్ మాట్లాడారని అంటున్నారు. అదే సమయంలో బీజేపీకి మద్దతిచ్చే విషయంలో వైసీపీ పునరాలోచించే అవకాశం కూడా ఉంది. అందుకే వెంటనే అధినాయకత్వం రంగంలోకి దిగింది. గజేంద్ర సింగ్ షెకావత్ తో ప్రకటన ఇప్పించింది. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల విషయంలో ప్రతి ఓటు కూడా కీలకమే. అందుకే తటస్థ పార్టీలతోపాటు, వైరి వర్గాలను కూడా కేంద్రం ఈ విషయంలో అభ్యర్థించింది. చివరకు తాను అనుకున్నది సాధించింది. ఎన్నికకు ముందే ద్రౌపదీ ముర్ము గెలుపు ఖాయం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: