ఒక్కసారిగా జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పేయాలన్నది కేసీయార్ బలమైన కోరిక. ఇందుకు పరిస్ధితులు ఎంతవరకు సహకరిస్తాయో కేసీయార్ తో పాటు ఎవరికీ తెలీదు. కాకపోతే తన గురించి తాను చాలా ఎక్కువగా కేసీయార్ అంచనాలు వేసుకుంటున్నట్లు అనుమానంగా ఉంది. తెలంగాణా వరకు కేసీయార్ ఏమి చెప్పినా, ఏమిచేసినా చెల్లుబాటవుతోంది. కానీ వచ్చేఎన్నికల తర్వాత కూడా ఇదే పద్దతిలో కేసీయార్ మాట చెల్లుబాటవుతుందో లేదో తెలీదు.





కేసీయార్ జాతీయ రాజకీయాల భవిష్యత్తంతా వచ్చేఎన్నికల ఫలితాల మీదే ఆధారపడుంది. సరే ఇక ప్రస్తుతానికి వస్తే కేసీయార్ కు మద్దతుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నిలిచారు. ఖమ్మం బహిరంగ సభలో పాల్గొన్నారు. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా కేసీయార్ గళమిప్పుతున్నారు కాబట్టే వీళ్ళంతా మద్దతుగా నిలబడ్డారు. మరి ప్రధానమంత్రి అభ్యర్ధిగా కేసీయార్ ను ప్రతిపాదించమంటే కూడా మద్దతిస్తారా ?





ఇపుడు కేసీయార్ బలమెంత ? 17 లోక్ సభ సీట్లలో బీఆర్ఎస్ బలం 9 సీట్లు. మిగిలిన కేజ్రీవాల్, విజయన్, మాన్, అఖిలేష్ బలమెంత ? దాదాపు నిల్లనే సమాధానం చెప్పాలి. పార్లమెంటులో 9 ఎంపీల బలమున్న కేసీయార్ 329 సీట్లున్న బీజేపీని ఏ విధంగా ఎదిరించగలరు ? లాజిక్కుకు ఎక్కడా సమాధానం దొరకటంలేదు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ సహకారం లేకుండా అసలు సాధ్యంకాదు.






ఎన్డీయేని ఎదిరించాలంటే యూపీఏ వల్లే సాధ్యం కావటంలేదు. అలాంటిది నాన్ యూపీఏ పార్టీలను ఏకతాటిపైకి తేవటం కేసీయార్ వల్లవుతుందా ? ఎన్డీయేకి వ్యతిరేకంగా యూపీఏ, నాన్ యూపీఏ పార్టీలు పోటీపడితే లాభపడేది మళ్ళీ ఎన్డీయేనే కదా. ఎన్డీయే అంటే మళ్ళీ బీజేపీనే కదా. ఎందుకంటే పేరుకే ఎన్డీయే కానీ అందులో బీజేపీని తీసేస్తే భాగస్వామ్య పార్టీల బలం నామమాత్రమే. పైగా కేసీయార్  స్ధిరత్వంలేని నేత కాబట్టే జాతీయ రాజకీయాల్లో ఏమాత్రం క్రెడిబులిటి లేదు. అందుకనే చాలామంది నేతలు కేసీయార్ కు దూరంగా ఉంటున్నారు. మరి ఇపుడున్న వాళ్ళని పెట్టుకుని కేసీయార్ ఏమిచేస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: