ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి అన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు మరియు 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది. ఇక్కడ కొలువైన అయ్యప్పను.. హిందువులు హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఇక శబరిమలలో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పరశురామ మహర్షి ప్రతిష్టించినట్లు చెపుతారు. ఇక శబరిమలైలో శ్రీ అయ్యప్పస్వామి దేవాలయములో అతిముఖ్యమైనది, అతి పవిత్రమైనది మన స్వామివారి ఆలయమునకు ముందున్న పదునెనిమిది మెట్లు. 

 

అంత పవిత్రమైన, సత్యమైన సాలగ్రామశిలతో నిర్మితమైన ఆ పద్దెనిమిది మెట్లను ఎక్కాలంటే స్వామివారి దీక్షమాల ధరియించి, మండల కాలము అనగా 41 దినముల పైన నియమనిష్టలతో వ్రతనియమములు ఆచరించి, పవితమైన ఇరుముడిని గురుస్వామి ద్వారా శిరస్సున ధరించిగాని ఎక్కుటకు వీలులేదు. అయితే వాస్త‌వానికి గతంలో పదునెట్టాంబడి ఎక్కే భక్తులూ, దిగే భక్తులూ మెట్టు మెట్టుకూ కొబ్బరికాయలు కొట్టే ఆనవాయితీ ఉండేది. దీనివల్ల మెట్లు పూర్తిగా శిథిలమయ్యాయి. దీంతో 1985 నవంబర్‌ 30న పంచలోహాలతో చేసిన తొడుగును మెట్లకు అమర్చారు. 

 

అప్పటి నుంచీ దీనికి ‘పొన్ను పదునెట్టాంబడి’గా పేరు వచ్చింది. అలాగే కొబ్బరికాయలు మెట్ల మీద కొట్టకుండా పక్కనే కింద భాగంలో కొట్టే ఏర్పాటు చేశారు. ఇక ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టుమీద... ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని గురుస్వాములు చెబుతారు. మాయోపాయాలు ఏమిటంటే.. 1.అష్ట రాగాలు- కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దర్పం, అహంకారం 2. పంచేంద్రియాలు- కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం 3. త్రిగుణాలు సత్వ గుణం, రజో గుణం, తమో గుణం 4.సంస్కార రాహిత్యం... అంటే మంచి నడవడిక లేకపోవడం 5.చివరిది అజ్ఞానం అంటే తనను తాను తెలుసుకోలేకపోవడం. అయితే ఎవరైనా సాధన ద్వారానే దీన్ని సాధించగలరు. అందుకే భక్తులు సాధన కోసం పలుసార్లు శబరిగిరి యాత్రకు వెళ్తారు.
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: